26 March, 2026 | 3:07 AM

హోటళ్లకు కేంద్రం హెచ్చరిక

26-03-2026 01:24 AM

ఎల్పీజీ సర్‌చార్జి వేయొద్దు..

అదనపు చార్జీలపై వినియోగదారులు ఫిర్యాదు చేయొచ్చు

హైదరాబాద్, మార్చి 25 (విజయక్రాంతి): హోటళ్లు, రెస్టారెంట్‌లు ఎల్పీజీ, ఫ్యూయల్ సర్‌చార్జి వంటివి వేయొద్దని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. వినియోగదారుల హక్కులను కాలరాస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక చేసింది. వినియోగదారుల హక్కులపై సీసీపీఏ (కేంద్ర వినియోగదారుల రక్షణ ప్రాధికార సంస్థ ) అడ్వైజరీని జారీచేసింది. మెనూ ధరల కంటే ఎక్కువ వసూలు చేయడం చట్టవిరుద్ధమని పేర్కొంది.

బిల్లు చెల్లింపు సమయంలో సర్‌చార్జిల పేరిట విడిగా డబ్బులు చేసే హక్కు యాజమాన్యాలకు లేదని స్పష్టంచేసింది. 2022 జూలై 4 మార్గదర్శకాలే ఇప్పటికీ అమల్లో ఉన్నాయని తెలిపింది. మెనూ కార్డు ధరే అంతిమ ధర కావాలని, కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన జీఎస్టీ ఆ ధరపై అదనంగా వేయొచ్చని, అంతకుమించి ఒక్కరూపాయి చెల్లించాల్సిందిగా వినియోగదారులను హోటల్ యాజ మాన్యాలు బలవంతంచేయొద్దని స్పష్టంచేసింది.

అదనపు చార్జీలు వేస్తే 1915 నేషనల్ కన్స్యూమర్ హెల్ప్ లైన్‌కు ఫోన్ చేసి ఫిర్యాదుచేయాలని, మొబైల్ యాప్‌లో పూర్తి వివరాలతో ఫిర్యాదు చేయొచ్చని తెలిపింది. ఈ జాగృతి పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో ఫిర్యా దు చేయొచ్చని తెలిపింది. అక్రమ వసూళ్లపై సీసీపీఏ దేశవ్యాప్తంగా గట్టి నిఘా పెట్టిందని స్పష్టంచేసింది. నిబంధనలు అతిక్రమించే యాజమాన్యాల లైసెన్సులు రద్దు, జరిమానాలు లాంటివి వేస్తామని హెచ్చరించింది.