మంథనిలో ప్రజా సమస్యపై చైర్మన్, వైస్‌చైర్మన్ తక్షణ స్పందన
చైతన్యపురి కాలనీలో మురుగునీటి నిల్వకు పరిష్కారం
మంథని, ఆగస్టు 7(విజయ క్రాంతి)మంథని మున్సిపల్ పరిధిలోని చైతన్యపురి కాలనీలో కొన్నేళ్లుగా కొనసాగుతున్న మురుగునీటి నిల్వ సమస్యకు మున్సిపల్ చైర్మన్ వొడ్నాల శ్రీనివాస్, వైస్ చైర్మన్ ముస్కుల సహేందర్ రెడ్డి తక్షణ పరిష్కారం చూపించారు. కాలనీలోని కుంటలో మురుగునీరు నిల్వ ఉండటంతో దోమలు విపరీతంగా పెరిగి, విషజ్వరాల భయంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయాన్ని స్థానికులు వారి దృష్టికి తీసుకెళ్లారు.ప్రజల సమస్యను తెలుసుకున్న చైర్మన్ వొడ్నాల శ్రీనివాస్, వైస్ చైర్మన్ ముస్కుల సహేందర్ రెడ్డి వెంటనే స్పందించి మున్సిపల్ కమిషనర్ ఎన్. మనోహర్, స్థానిక కౌన్సిలర్ కుర్ర లింగయ్యతో కలిసి చైతన్యపురి కాలనీకి చేరుకున్నారు.
కుంటలోని పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించి, సమస్య తీవ్రతను గుర్తించారు.అనంతరం జేసీబీలను ఏర్పాటు చేసి కుంటలో నిల్వ ఉన్న మురుగునీటిని తొలగించే పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టి పూర్తి చేయించారు. దీంతో కొన్నేళ్లుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న కాలనీ వాసులకు ఊరట లభించింది.ప్రజల సమస్యలను తమ దృష్టికి తీసుకువచ్చిన వెంటనే స్పందించి, క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కారం చూపించిన చైర్మన్ వొడ్నాల శ్రీనివాస్, వైస్ చైర్మన్ ముస్కుల సహేందర్ రెడ్డిలకు కాలనీ వాసులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మురుగునీటి సమస్యను పరిష్కరించడంపై వారు హర్షం వ్యక్తం చేశారు.






