8 August, 2026 | 2:48 AM

రక్షణనేత్రంతో జిల్లాలో భద్రత పటిష్టం

08-08-2026 01:50 AM

ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా

వికారాబాద్ రూరల్, ఆగస్టు 7 (విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా పోలీసులు ప్రతిష్ఠాత్మకమైన వికారాబాద్ రక్షణ నేత్రం కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణ, నేరాల నియంత్రణ, మహిళలు, చిన్నారుల భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ నిర్వహణను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దే లక్ష్యంతో, జిల్లా పోలీసు యంత్రాంగం పనిచేస్తుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే పరిగి, తాండూర్, చెంగోముల్, మర్పల్లి, మొమిన్పేట్, నవాబ్పేట్, కొడంగల్ మరియు ఇతర పోలీస్ స్టేషన్లలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయబడ్డాయి. ఇదే విధంగా జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్లో కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లను ఏర్పాటు చేసి, వాటిని సీసీటీవీ నిఘా వ్యవస్థతో అనుసంధానం జిల్లా ఎస్పీ తెలిపారు.

ఈ ఏడాదిలో తమ ఆదేశాల మేరకు ‘నేను సైతం‘ కార్యక్రమం ద్వారా 1,040 సీసీటీవీ కెమెరాలు, ప్రజల భాగస్వామ్యంతో 756 సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయగా, మొత్తం కొత్తగా ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల సంఖ్య 1,796కు చేరిందని జిల్లా ఎస్పీ తెలిపారు.

నేరాల నియంత్రణను మరింత బలోపేతం చేయడానికి జిల్లాలోని ముఖ్యమైన కూడళ్లు, జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు మరియు ఇతర సున్నితమైన ప్రాంతాల్లో 20 ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరాలను ఏర్పాటు చేయడంతో పాటు, అత్యాధునిక పీటీజెడ్ పాన్-టిల్ట్-జూమ్ మరియు నైట్ విజన్ సీసీటీవీ కెమెరాలను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజల సహకారంతో వికారాబాద్ జిల్లాను రాష్ట్రంలోనే అత్యంత సురక్షితమైన జిల్లాగా తీర్చిదిద్దడమే మా లక్ష్యం, అని జిల్లా ఎస్పీ తెలిపారు.