21-11-2024 12:01:26 AM
* భారత అమ్మాయిల దెబ్బకు చైనీయులు అబ్బ అన్నారు. రాజ్‌గిర్‌లో రెచ్చిపోయిన టీమిండియా చైనా గోడను సమర్థంగా అడ్డుకొని వరుసగా రెండో ఏడాది మహిళల ఆసియా హాకీ చాంపియన్స్ ట్రోఫీ కైవసం చేసుకున్నారు.
రాజ్‌గిర్ (బిహార్): మహిళల ఆసియా చాంపియన్స్ హాకీ ట్రోఫీలో మన అమ్మాయిలు అదుర్స్ అనిపించారు. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన భారత్ వరుసగా రెండోసారి కప్పును నిలబెట్టుకుంది. బుధవారం జరిగిన ఫైనల్ పోరులో అమ్మాయిల బృందం 1-0 తేడాతో చైనా మీద విజయం సాధించింది.
ఆతిథ్య హోదాలో టోర్నీలో బరిలోకి దిగిన సలీమా సేన లీగ్ దశ నుంచి ఫైనల్ వరకు ఒక్క మ్యాచ్‌లోనూ ఓటమి చవిచూడకుండా ట్రోఫీని కైవసం చేసుకోవడం విశేషం. గతంలో రెండుసార్లు రన్నరప్‌గా నిలిచిన చైనా తొలిసారి టైటిల్ అందుకోవాలనుకున్నప్పటికీ నిరాశే ఎదురైంది.
మూడో క్వార్టర్‌లో..
భారత్-చైనా మధ్య ఫైనల్ మ్యాచ్ ఆధ్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. రెండు జట్లకు పెనాల్టీ కార్నర్ అవకాశాలు వచ్చినా కానీ అవి గోల్స్‌గా మలచడంలో ఇరుజట్ల ఆటగాళ్లు విఫలం అయ్యారు. ఎట్టకేలకు మూడో క్వార్టర్‌లో సూపర్ ఫామ్‌లో ఉన్న భారత స్టార్ దీపికా మరోసారి మెరిసి భారత్‌కు గోల్ అందించింది. అందరూ ఆశ్చర్యపోయేలా దీపికా రివర్స్ హిట్‌తో గోల్ సాధించింది.
ఈ టోర్నీలో చైనా భారత్ చేతిలో ఓడిపోవడం ఇది రెండో సారి. గ్రూప్ దశలో 3-0 తేడాతో భారత్ మీద చిత్తయిన చైనీయులు, ఫైనల్‌లో మరోసారి భంగపడ్డారు. కాగా భారత్‌కు ఇది మూడో ఆసియా చాంపియన్స్ ట్రోఫీ. గతంలో 2016, 2023లో ఈ ట్రోఫీని నెగ్గింది. మ్యాచ్ అనంతరం బహుమతి ప్రధానోత్సవానికి కేంద్ర క్రీడా శాఖా మంత్రి మన్‌సుఖ్ మాండవీయ హాజరయ్యారు.