23-01-2026 09:55:28 PM
హనుమకొండ,(విజయక్రాంతి): సుబేదారిలోని కాకతీయ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో శుక్రవారం జాతీయ ఓటర్ దినోత్సవాన్ని కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ సుంకరి జ్యోతి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు విలువ అత్యంత కీలకమైందని, ప్రతి పౌరుడు ప్రజాస్వామ్య పద్ధతిలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ముఖ్యంగా యువత ఓటరు నమోదు చేసుకొని బాధ్యతాయుత పౌరులుగా వ్యవహరించాలన్నారు.
ఓటు హక్కు వినియోగం ద్వారా మాత్రమే దేశ భవిష్యత్తును దిశానిర్దేశం చేయవచ్చని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ రెహ్మాన్, ఎన్ఎస్ఎస్ విభాగం అధికారులు డాక్టర్ శ్రీదేవి, డాక్టర్ శ్రీలత, డాక్టర్ చందర్ పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులతో ఓటరు అవగాహన ప్రతిజ్ఞ చేయించారు.