23-01-2026 10:04:26 PM
బెల్లంపల్లి లో రూ. 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూలుకు శంకుస్థాపన
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
బెల్లంపల్లి,(విజయక్రాంతి): విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేస్తుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం జిల్లాలోని బెల్లంపల్లి పట్టణంలో బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, డి.సి.పి. ఎ.భాస్కర్, బెల్లంపల్లి బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్, టి జి ఈ డబ్ల్యూ ఐ డి సి ఈ.ఈ., జిల్లా విద్యాధికారి యాదయ్య, బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ జె. సంపత్ లతో కలిసి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యావ్యవస్థను మరింత పటిష్టం చేసే లక్ష్యంలో భాగంగా జిల్లాలో 3 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. బెల్లంపల్లి నియోజకవర్గ పరిధిలోని విద్యార్థులకు అందుబాటులో ఉండే విధంగా బెల్లంపల్లి పట్టణంలో రూ.200 కోట్ల వ్యయంతో నిర్మాణానికి అనువైన 25 ఎకరాల విస్తీర్ణంలో పాఠశాల ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారు. విద్యా రంగ అభివృద్ధి కొరకు ప్రభుత్వం అధిక మొత్తంలో నిధులు కేటాయించడం జరుగుతుందని, విద్యార్థులందరికీ ఉపయోగపడే విధంగా పాఠశాల నిర్మాణం జరుగుతుందని తెలిపారు.
జిల్లాలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాల అభివృద్ధికి ఒక్కొక్క పాఠశాలకు. రూ.1 కోటి చొప్పున మంజూరు చేసి చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో త్రాగునీరు, విద్యుత్, ప్రహరీ గోడ, విద్యార్థినీ విద్యార్థులకు వేరువేరుగా మూత్రశాలలు ఇతర సదుపాయాలు కల్పించడం జరుగుతుందని తెలిపారు. 30 మంది విద్యార్థుల వరకు ఒకరు, 30 నుండి 60 మంది విద్యార్థుల వరకు ఇద్దరు ఉపాధ్యాయుల చొప్పున నిష్ణాతులైన ఉపాధ్యాయులను నియమించి విద్యార్థులకు నాణ్యమైన విద్య బోధన అందించడం జరుగుతుందని తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలలలో మెనూ ప్రకారం పౌష్టిక ఆహారం అందిస్తూ విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించడంతో పాఠశాలలలో విద్యార్థుల హాజరు శాతం పెరిగిందని, రాష్ట్రంలోనే మంచిర్యాల జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థుల సంఖ్య ఈ విద్యా సంవత్సరంలో గణనీయంగా పెరిగిందని తెలిపారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థులకు డైనింగ్ హాల్, ఆట స్థలం, ఇతర అన్ని సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో పాఠశాలను ఏర్పాటు చేసి 2 వేల 500 మందికి పైగా విద్యార్థులకు 5వ తరగతి నుండి 12వ తరగతి వరకు సకల సౌకర్యాలతో కూడిన నాణ్యమైన విద్యను అందించడం జరుగుతుందని వెల్లడించారు.
కుల మతాలతో సంబంధం లేకుండా విద్యార్థులందరికీ ఒకే రకమైన విద్య, ఏకరూప దుస్తులు అందించడం జరుగుతుందని తెలిపారు. విద్యార్థులకు వసతి గృహంతో పాటు ఉపాధ్యాయులకు ప్రత్యేక వసతి ఏర్పాట్లు చేయడం జరుగుతుందని తెలిపారు. పనులు వేగవంతం చేసి 2027 విద్యా సంవత్సరంలో తరగతులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు అవసరమైన నిధులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.