రాహులా.. సంజూనా?

30-04-2024 01:18:54 AM

టీ20 ప్రపంచ కప్‌నకు నేడు జట్టు ప్రకటన! 

న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టును నేడు ప్రకటించే అవకాశముంది. అజిత్ అగార్కర్ సారధ్యంలోని జాతీయ సెలక్షన్ కమిటీ మంగళవారం బీసీసీఐ సెక్రటరీ జై షాతో అహ్మదాబాద్‌లో భేటీ కానుంది. కాగా పొట్టి ప్రపంచకప్‌కు జట్లను ఎంపిక చేసే గడువు రేపటితో ముగియనుంది. గడువులోగా భారత ప్రాథమిక జట్టు వివరాలను  ఐసీసీకి పంపించాల్సి ఉంటుంది. జట్టు ఎంపికపై పూర్తి క్లారిటీతో ఉన్న సెలక్షన్ కమిటీ రెండో వికెట్ కీపర్, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఎంపిక విషయమై తర్జన భర్జన పడుతోంది. రెగ్యులర్ వికెట్ కీపర్‌గా పంత్ స్థానం ఖాయమయ్యే అవకాశముంది. దీంతో పంత్‌కు బ్యాకప్‌గా కేఎల్ రాహుల్, సంజూ శాంసన్‌లలో ఎవరిని ఎంపిక చేయనున్నారనేది ఆసక్తికరం. ఐపీఎల్లో ఈ ఇద్దరు నిలకడగా రాణిస్తున్నారు. రాహుల్ 144 స్ట్రుక్‌రేట్‌తో 378 పరుగులు చేయగా.. శాంసన్ 161 స్ట్రుక్‌రేట్‌తో 385 పరుగులు సాధించాడు. శాంసన్‌తో పోలిస్తే రాహుల్‌కే ఎక్కువ అవకాశముంది. అంతర్జాతీయ క్రికెట్‌లో రాహుల్ మిడిలార్డర్‌లో 4, 5 స్థానాల్లోనూ బ్యాటింగ్ చేయడంతో సెలక్షన్ కమిటీ అతని వైపు మొగ్గు చూపే చాన్స్ ఉంది. ఇక ఆల్‌రౌండర్ పాండ్యా ఎంపికపై సస్పెన్స్ నెలకొంది. ఐపీఎల్లో కెప్టెన్సీ ఒత్తిడితో బ్యాటింగ్, బౌలింగ్‌లో పూర్తిగా విఫలమవుతున్న పాండ్యాకు చోటు దక్కడం ప్రశ్నార్థకమే. ఒకవేళ పాండ్యాకు అవకాశం దక్కకపోతే సెలక్షన్ కమిటీ దూబేను పరిగణలోకి తీసుకుంటుందేమో చూడాలి. తాజా ఐపీఎల్లో రాణిస్తున్న హైదరాబాద్ కుర్రాడు తిలక్ వర్మ, సన్‌రైజర్స్ సంచలనం అభిషేక్ శర్మ, రింకూ సింగ్, జితేశ్ శర్మ, ధ్రువ్ జురేల్ పేర్లు కూడా కమిటీ పరిశీలనలో ఉన్నాయి.