వరుణ్ మ్యాజిక్

30-04-2024 01:12:53 AM

మెరిసిన సాల్ట్, అరోరా 

ఢిల్లీపై కోల్‌కతా విజయం

ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన కోల్‌కతా నైట్ రైడర్స్ ఐపీఎల్లో 

ఆరో విజయం ఖాతాలో వేసుకుంది. మండు వేసవిలో వరుస భారీ స్కోర్లు నమోదవుతున్న మ్యాచ్‌ల మధ్య.. ఈసారి బౌలర్లు ప్రభావం చూపారు. వరుణ్ చక్రవర్తి స్పిన్ మ్యాజిక్‌కు వైభవ్ అరోరా, హర్షిత్ రాణా పేస్ సహకారం తోడవడంతో తొలుత ఢిల్లీ ఓ మోస్తరు లక్ష్యానికే పరిమితం కాగా.. ఓపెనర్ సాల్ట్ దూకుడుతో అది కేకేఆర్ ముందు మరీ చిన్నబోయింది. సొంతగడ్డపై సాధికారిక విజయం సాధించిన కేకేఆర్ ప్లేఆఫ్స్ దిశగా మరో ముందడుగు వేసింది.

కోల్‌కతా: సొంతగడ్డపై కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) సమష్టిగా సత్తాచాటింది. మొదట బౌలర్లు రాణించి ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే కట్టడి చేయగా.. ఆనక బ్యాటర్లు మిగిలిన పని పూర్తి చేశారు. దీంతో సోమవారం ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన పోరులో కోల్‌కతా 7 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై విజయం సాధించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (26 బంతుల్లో 35 నాటౌట్; 5 ఫోర్లు, ఒక సిక్సర్) టాప్ స్కోరర్ కాగా.. కెప్టెన్ రిషబ్ పంత్ (27; 2 ఫోర్లు, ఒక సిక్సర్) పర్వాలేదనిపించాడు. తక్కినవాళ్లంతా విఫలమయ్యారు. గత మ్యాచ్‌లో విధ్వంసం సృష్టించిన జెక్ ఫ్రెజర్ మెక్‌గుర్క్ (12) మరోసారి ధాటిగా ఆడే ప్రయత్నంలో పెవిలియన్ చేరగా.. పృథ్వీ షా (13) వైఫల్యాల పరంపర కొనసాగించాడు. అభిషేక్ పొరెల్ (18) ఎక్కువసేపు నిలువలేకపోగా.. షై హోప్ (6) ఇలా వచ్చి అలా వెళ్లాడు. అక్షర్ పటేల్ (15), స్టబ్స్ (4) మెరుపులు మెరిపించలేకపోయారు. ఆఖర్లో కుల్దీప్ కాస్త బ్యాట్‌కు పనిచెప్పడంతో ఢిల్లీ గౌరవప్రద స్కోరు చేయగలిగింది. కోల్‌కతా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 3, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో కోల్‌కతా 16.3 ఓవర్లలో 3 వికెట్లకు 157 పరుగులు చేసింది. ఓపెనర్ ఫిల్ సాల్ట్ (33 బంతుల్లో 68; 7 ఫోర్లు, 5 సిక్సర్లు) ఈడెన్ గార్డెన్స్ హోరెత్తించగా..  శ్రేయస్ అయ్యర్ (23 బంతుల్లో 33 నాటౌట్; 3 ఫోర్లు, ఒక సిక్సర్), వెంకటేశ్ అయ్యర్ (26 నాటౌట్; 2 ఫోర్లు, ఒక సిక్సర్) మిగిలిన పనిపూర్తి చేశారు. ఢిల్లీ బౌలర్లలో అక్షర్ రెండు వికెట్లు పడగొట్టాడు. లీగ్‌లో భాగంగా మంగళవారం లక్నో సూపర్ జెయింట్స్‌తో ముంబై ఇండియన్స్ అమీతుమీ తేల్చుకోనుంది. 

బ్యాటింగ్ ఢమాల్..

గత మ్యాచ్‌లో ఫ్రెజర్ మెర్‌గుర్క్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో అలవోక విజయం సాధించిన ఢిల్లీ.. సేమ్ సీన్ రిపీట్ చేయలేకపోయింది. మూడు ఫోర్లతో మంచి టచ్‌లో కనిపించిన పృథ్వీ రెండో ఓవర్‌లో వెనుదిరగగా.. తదుపరి ఓవర్‌లో ఫ్రెజర్ అతడిని అనుస రించాడు. అరోరా అద్భుత బంతికి హోప్ డగౌట్ బాట పట్టగా.. పంత్ కాస్తా పోరాడాడు. ఈ దశలో వరుణ్ చక్రవర్తి ఆగమనంతో ఢిల్లీ కష్టాలు రెట్టింపయ్యాయి. అప్పటి వరకు పేసర్లు వికెట్ల వేట కొనసాగిస్తే.. అక్కడి నుంచి చక్రవర్తి తన స్పిన్ మ్యాజిక్ చూపాడు. ఆడేందుకు ఏమాత్రం వీలు లేని బంతితో పంత్‌ను బుట్టలో వేసుకున్న వరుణ్.. ధాటిగా ఆడే సత్తా ఉన్న స్టబ్స్‌ను కీపర్ క్యాచ్ ద్వారా వెనక్కి పంపాడు. దీంతో ఢిల్లీ ఆ మాత్రం స్కోరైనా చేస్తుందా అనే అనుమానాలు రెకెత్తెగా.. ఆఖర్లో కుల్దీప్ యాదవ్ విలువైన పరుగులు చేసి క్యాపిటల్స్‌కు పోరాడే స్కోరు అందించాడు. 

సంక్షిప్త స్కోర్లు

ఢిల్లీ: 20 ఓవర్లలో 153/9 (కుల్దీప్ 35 నాటౌట్, రిషబ్ పంత్ 27; వరుణ్ చక్రవర్తి 3/16, హర్షిత్ 2/28), 

కోల్‌కతా: 16.3 ఓవర్లలో 157/3 (సాల్ట్ 68, శ్రేయస్ 33 నాటౌట్; అక్షర్ 2/25).