24 August, 2026 | 5:55 AM

చంద్రబాబు 4.0

13-06-2024 12:31 AM
  • మూడు పదుల వయస్సులోనే మంత్రిగా బాధ్యతలు

తొమ్మిదిసార్లు ఎమ్మెల్యేగా గెలుపు

15 ఏళ్లపాటు ప్రతిపక్ష నేత

45 ఏళ్ల రాజకీయ 

ప్రస్థానంలో ఎన్నో ఆటుపోట్లు.. మరెన్నో ఉన్నత శిఖరాలు

హైదరాబాద్, జూన్ 12 (విజయక్రాంతి): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని నాటి చిత్తూరు జిల్లాలో 1950 ఏప్రిల్ 20న చంద్రబాబునాయుడు జన్మించారు. సాధారణ మధ్యతర గతి రైతు కుటుంబంలో పుట్టిన ఆయన చిన్నతనం నుంచే నాయకత్వ లక్షణాలను అలవర్చుకున్నారు. యూత్ కాంగ్రెస్ విభాగానికి ప్రాతినిథ్యం వహించి యూనివర్సిటీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. 1978లో 28 ఏళ్లకే ఎమ్మెల్యేగా ఎన్నికై తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. రెండేళ్ల తర్వాత నాటి సీఎం అంజయ్య క్యాబినెట్‌లో సినిమాటోగ్రఫీ మంత్రిగా పని చేశారు. 1981 సెప్టెంబర్ 10న ఎన్టీఆర్ కుమార్తె భువనేశ్వరితో ఆయన వివాహం జరిగింంది.

1983లో నాదెండ్ల భాస్కర్‌రావు ఉదంతం తర్వాత.. ఎన్టీఆర్‌కు అండగా ఉండేందుకు చంద్రబాబు టీడీపీలో చేరారు. 1989లో పార్టీలో వివిధ హోదాల్లో కీలక బాధ్యతలు నిర్వహించారు. 1989 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది. ఓటమి భారంతో నాడు ఎన్టీఆర్ అసెంబ్లీకి వెళ్లలేదు. దీంతో చంద్రబాబు రంగంలోకి దిగి టీడీపీ శాసనసభా పక్ష నేత గా అసెంబ్లీ వ్యవహారాలు చూసుకున్నారు. 1994 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చి ఎన్టీఆర్ సీఎం అయిన తర్వాత, చంద్రబాబు క్యాబినెట్ మంత్రి అయ్యారు. 1995లో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల తర్వాత ఎన్టీఆర్‌ను సీఎం పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు.

సైబరాబాద్ నిర్మాణంతో ఐటీకి ఊతం..

చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత హైదరాబాద్‌లో ఐటీ విస్తరణకు విశేష కృషి చేశారు. నేడు హైదరాబాద్  ఐటీ రంగంలో మెరుగైన స్థితిలో ఉందంటే, అందుకు నాడు చంద్రబాబు చేసిన కృషి వల్లే అని అనేకమంది రాజకీయ ప్రముఖు లు పలు సందర్భాల్లో ప్రస్తావించారు. సైబరాబాద్‌ను నిర్మించి హైదరాబాద్‌కు మైక్రోసాఫ్ట్ వంటి అతిపెద్ద కంపెనీలను తీసుకురావడంలో ముఖ్యభూమిక పోషించారు. అంతేకాకుండా, నాటి అమెరికన్ ప్రెసిడెంట్ బ్లిన్  క్లింటన్, సాఫ్ట్‌వేర్ దిగ్గజం బిల్ గేట్స్‌తో పాటు పలువురు దేశాధినేతలను ఆంధ్రాకు రప్పించి అందరి దృష్టి హైదరాబాద్ వైపు మళ్లేలా చేశారు.

గడిచిన ఐదేళ్లలో చేదు అనుభవాలు..

45 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో చంద్రబాబు ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. ఎత్తుపల్లాలను చూశారు. 2003లో అలిపిరి వద్ద మావోయిస్టుల మందుపాతర నుంచి ప్రాణాలతో బయటపడ్డారు. ఆ చేదు అనుభవం నుంచి తేరుకుని తిరిగి రాజకీయాలు కొనసాగించారు. ఏకంగా పదేళ్ల పాటు ప్రతిపక్షంలో కూర్చుకున్నారు. రాజకీయ రణ క్షేత్రంలో ఎందరో యోధానుయోధులను ఢీకొన్నారు. 2019 వరకు ఒక అధ్యాయం అయితే.. గత ఐదేళ్లలో ఆయన జీవితంలో మరో అధ్యాయం అని చెప్పాలి. గడిచిన ఐదేళ్లలో చంద్రబాబు పలు చేదు అనుభవాలు ఎదురయ్యాయి. ఒకానొక సమయంలో మీడియా ముఖంగా కన్నీళ్లు సైతం పెట్టుకున్నారు. ప్రత్యేక పరిస్థితుల్లో ఆయన జైలుకు కూడా వెళ్లారు. అనారోగ్య సమస్యలతో సతమతమయ్యారు. ఎలాంటి అవరోధం ఎదురై నా వాటిని లెక్కచేయకుండా, సమరోత్సాహంతో ముందుకువెళ్లి అసెంబ్లీ ఎన్నికల్లో విజయదుందుభి మోగించారు. తిరిగి జనసేన, బీజేపీతో కలిసి ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీని అధికారంలోకి తీసుకొచ్చారు.

మరోసారి కేంద్రంలో చంద్రబాబు హవా

1999లో చంద్రబాబు కేంద్రంలో చక్రం తిప్పారు. ఎన్డీఏ కూటమిగా కన్వీనర్‌గా పని చేశారు. 2024లోనూ చంద్రబాబు జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర వహించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి 175 అసెంబ్లీ స్థానాలకు గానూ ఏకంగా 164 సీట్లను గెల్చుకుంది. 25 లోక్ సభ స్థానాలకు గానూ 21 సీట్లను కూటమి కైవసం చేసుకుంది. ఇందులో 16 ఎంపీ సీట్లు టీడీపీవే కావడంతో ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు ముఖ్యభూమిక పోషిస్తారనడంలో సందేహం లేదు.

కెరీర్‌లో మైలురాళ్లు..

  1. 1975 యూత్ కాంగ్రెస్ ద్వారా రాజకీయ రంగప్రవేశం

1978 చంద్రగిరి నుంచి ఎమ్మెల్యేగా తొలిసారి ఎన్నిక

1980 అంజయ్య క్యాబినెట్‌లో మంత్రిగా బాధ్యతలు

1981 భువనేశ్వరితో వివాహం

1983 ఎమ్మెల్యేగా చంద్రగిరిలో ఓటమి

1984 టీడీపీలో చేరిక

1985 టీడీపీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు

1989  కుప్పం నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నిక

1994  మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నిక, రెవెన్యూశాఖ మంత్రిగా బాధ్యతలు

1995 ఉమ్మడి ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం

1996 యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్

1999 ఉమ్మడి ఏపీకి రెండోసారి సీఎంగా బాధ్యతలు

1999 ఎన్డీయే కన్వీనర్‌గా ఎన్నిక

2003 అలిపిరి వద్ద మావోయిస్టుల దాడిలో తీవ్రగాయాలు

2004 వరకు ఉమ్మడి ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా బాధ్యతలు

2014 విభజిత ఆంధ్రప్రదేశ్‌లో సీఎంగా ప్రమాణస్వీకారం

2019 టీడీపీ ఓటమితో ప్రతిపక్ష నేతగా బాధ్యతలు

2024 విభజన ఏపీలో సీఎంగా రెండోసారి ప్రమాణస్వీకారం