03-01-2026 12:00:00 AM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భారతదేశ రాజకీయాల్లో నాయకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నా రు. ఇటీవలే తిరుపతిలో నిర్వహించిన భారతీయ విజ్ఞాన సమ్మేళనం ముగింపు వేడుకలతో పాటు డిసెంబర్ 28న అయోధ్య బాలరాముడి సందర్శనానంతరం చంద్రబాబు నాయుడు.. లౌకికవాదం, సనాతన ధర్మం గొప్పతనం గురించి మాట్లాడిన తీరు ప్రశంసనీయం. ఆయన వ్యాఖ్యలు భారతీయ ఇతిహాసాలపై తనకున్న సైద్ధాంతిక పథాన్ని స్పష్టంగా తెలియజేశాయి.
తిరుపతిలో నిర్వహించిన భారతీయ విజ్ఞాన సమ్మేళనానికి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) చీఫ్ మోహన్ భగవత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా మన దేశ సాంస్కృతిక వారసత్వాన్ని, పురాణాల గొప్పతనాన్ని ప్రస్తుత సాంకేతికతతో ముడిపెడుతూ చంద్రబాబు మాట్లాడిన తీరు అందరినీ ఆకట్టుకుంది. సనాతన ధర్మాన్ని కాపాడిన మన హీరోలైన హనుమంతుడు, అర్జునుడు, కృష్ణుడు.. కామిక్ సూపర్ హీరోలైన బ్యాట్‌మాన్, సూపర్‌మాన్‌కు ఏమాత్రం తీసిపోరని, వీరి గురించి ఈ తరం పిల్లలకు స్పష్టంగా వివరించాల్సిన అవసరముందన్నారు.
ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన అవతార్ వంటి సినిమాల కంటే మన రామాయణ, మహాభారత గాథలు గొప్పవని, వాటిలో ఉన్న లోతును పిల్లలకు అర్థమయ్యేలా వివరించాలన్నారు. ప్రపంచంలోనే అత్యున్నత వ్యక్తిత్వం కలిగిన పురుషోత్తముడు శ్రీరాముడు అని, ఆదర్శవంతమైన పాలన అంటే రామరాజ్యం గుర్తుకు వచ్చే లా ఆయన పాలనా విశిష్టతను నేటి తరానికి వివరించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈ సమ్మేళనం విజ్ఞానానికి సంబంధించినది కావడంతో, ఆధ్యాత్మికతకు సైన్స్‌కు ఉన్న సారూప్యాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
సనాతన ధర్మాన్ని ఆధునిక సాంకేతికతతో కలిపి ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. పిల్లల్లో చిన్నతనం నుంచే భారతీయ సంస్కృతి పట్ల గౌరవం పెంచేలా విద్యా వ్యవస్థలో మార్పులు రావాలని, తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు ఇంట్లోనే పురాణ కథలను వినిపించాలని ఆయన సూచించారు. ఐటీ, టెక్నాలజీ గురించి ఎక్కువగా మాట్లాడే చంద్రబాబు ఈసారి మా త్రం ఆధ్యాత్మికత, భారతీయ వారసత్వం గురించి ఎక్కువగా మాట్లాడడం విశేషం.
లౌకిక స్ఫూర్తి..
చంద్రబాబునాయుడు రాజకీయ జీవితం భారత జా తీయ కాంగ్రెస్‌లో మొదలైంది. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ వంటి నాయకుల నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ లౌకికవాదం, సోషలిజం, మధ్యేవాద విధానాలతో ముడిపడి ఉండేది. 1978లో, 28 సంవత్సరాల వయసులో చంద్రగిరి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్‌పై బరిలోకి దిగిన చంద్రబాబు తొలిసారి ఆంధ్రప్రదేశ్ శాసనస భకు ఎన్నికయ్యారు. 1980 నుంచి 1983 వరకు కాంగ్రెస్ ప్రభుత్వాల్లో మంత్రిగా పనిచేశారు.
సినిమాటోగ్రఫీ (1980--1981), సాంకేతిక విద్య, మైనర్ ఇరిగేషన్ (1982--1983) వంటి మంత్రిత్వ శాఖలను సమర్థంగా నిర్వహించారు. మంత్రిగా పనిచేసినంత కాలం లౌకిక భావంతో తన కర్తవ్యాలను నిర్వహించారు. ఆ తర్వాత మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో 1983లో చంద్రబాబు తనకు పిల్లనిచ్చిన మామ, నటుడు నందమూరి తారకరామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ (టీడీపీ)లో చేరడంతో ఆయన రాజకీయ జీవితం మరో మలుపు తీసుకుంది. అనతికాలంలోనే టీడీపీలో కీలక నేతగా ఎదిగారు.
1983లో చంద్రగిరి నుంచి టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1989లో టీడీపీ ఓడిపోయినప్పుడు, చంద్రబాబు పార్టీ సమన్వయకర్తగా పార్టీని ముందుండి నడిపించారు. అదే సమయంలో ప్రతిపక్ష పాత్రను బలోపేతం చేయడంతో పాటు పార్టీలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. 1995లో జరిగిన నాటకీయ పరిణామాల తర్వాత ఎన్టీఆర్‌ను సీఎం పదవి నుంచి తప్పించిన చంద్రబాబు తొలిసారి ముఖ్యమంత్రి గా బాధ్యతలు చేపట్టారు.
1995 నుంచి 2004 వరకు ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని ఆర్థిక సరళీకరణ వైపు నడిపించారు. విజన్ 2020 వంటి కార్యక్రమాలతో పాటు ఐటీ మౌలిక సదుపాయాలపై చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారు. సాఫ్ట్‌వేర్ పార్కుల్లో పెట్టుబడులతో హైదరాబాద్‌ను ‘సైబరాబాద్’గా మార్చిన ఘనత బాబుకే సొం తం. అంతేకాదు మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టడంలో ఆయనదే కీలకపాత్ర. సమాజ అభివృద్ధి కోసం జన్మభూమి వంటి కార్యక్రమాలను అమలు చేసి లౌకిక స్ఫూర్తిని ప్రదర్శించారు.
పొత్తులే ప్రదానం..
రాజకీయ జీవితంలో చంద్రబాబు తన ఎదుగుదలకు ఇతర పార్టీలతో పెట్టుకున్న పొత్తులు అతనికి అనుకూల ఫలితాలనే తెచ్చిపెట్టాయనడంలో సందేహం లేదు. 1998లో తొలిసారి ఎన్డీయే కూటమితో జతకట్టిన చంద్రబాబు 1999 నుంచి 2004 వరకు కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇస్తూనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండోసారి ము ఖ్యమంత్రిగా కొనసాగారు. ఈ భాగస్వామ్యాన్ని తనకు అ నుకూలంగా మలుచుకున్న చంద్రబాబు అభివృద్ధి పేరు తో పని చేసుకుంటూ వెళ్లారు.
అయితే జాతీయంగా ఎన్డీయేతో పొత్తు పెట్టుకొని లాభాలు సాధించిన చంద్రబాబు 2003లో రాష్ట్రంలో నెలకొన్న అనిశ్చితి పరిస్థితులు, వ్యవసాయ సంక్షోభం ఆయన్ను అధికారానికి దూరం చేశా యి. అప్పటి నుంచి పదేళ్ల పాటు అధికారానికి దూరంగా ఉండిపోయారు. 2014 వరకు టీడీపీ పార్టీ ఒక లౌకిక, ప్రాంతీయ ప్రత్యామ్నాయంగా పునర్నిర్మించే ప్రయత్నం లో బాబు మునిగితేలారు. 2014లో తెలంగాణ ఆవిర్భా వం తర్వాత విభజన రాజకీయాలు చంద్రబాబుకు మళ్లీ ఊపిరినిచ్చాయి.
ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో మరోసారి పొత్తు పెట్టు కుని ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చారు. ఈ సమయంలో కొత్త రాజధాని అమరావతి ఏర్పాటుతో పాటు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చారు. అయితే ఆంధ్ర ప్రయోజనాలను బీజేపీ నిర్లక్ష్యం చేసిందని ఆరోపించిన చంద్రబాబు 2018లో ఎన్డీయే కూటమి నుంచి బయటకొచ్చేశారు. ఈ విరామం చంద్రబాబు లౌకిక ఇమేజ్‌ను మరింత బలోపేతం చేసింది.
ఆర్‌ఎస్‌ఎస్‌పై ప్రశంసలు..
2019 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కేవలం 23 సీట్లకు పరిమితమై అధికారాన్ని కోల్పోయింది. ఆ తర్వాత 2023 లో చంద్రబాబు అవినీతి ఆరోపణలపై అరెస్టుతో పాటు చట్టపరమైన సవాళ్లను చాలానే ఎదుర్కొన్నారు. ఐదేళ్ల పాటు పదవికి దూరంగా ఉన్న చంద్రబాబు 2024లో తిరిగి అధికారంలోకి రావడం మరో పునర్వ్యవస్థీకరణకు దారితీసింది. బీజేపీ, జనసేనలతో కలిసి కూటమిగా ఏర్పడిన చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ ఒంటరిగానే 135 సీట్లు గెలుచుకుంది. దీంతో నాలుగోసారి చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
అంతిమంగా చంద్రబాబు పొత్తుల కోసం తన వ్యూహాలకు పదును పెట్టిన తీరు ఇక్కడ గమనించాల్సిన అంశం. ఇదే భారతీయ విజ్ఞాన సమ్మేళనం లో చంద్రబాబు దేశ నిర్మాణం లో ముఖ్యపాత్రను పోషించిన ఆర్‌ఎస్‌ఎస్‌ను ప్రశంసలతో ముంచెత్తారు. మన సనాతన ధర్మం విలువలను పెంపొందించడానికి పాశ్చాత్య సూపర్ హీరోల కంటే భారతీయ ఇతిహాసాల్లో ఉన్న మన హీరోలను ఆదర్శంగా తీసుకోవాలని భగవత్ చెప్పిన మాటలు పాటించాల్సిన అవసరముందన్నారు.
2047 కల్లా భారతదేశం ప్రపంచ జనాభాలో అగ్రస్థానం లో నిలుస్తుందన్న భగవత్ వ్యాఖ్యలను తాను సమర్థిస్తున్నట్లు తెలిపారు. అయితే ఇక్కడ చంద్రబాబు రాజకీయ అవసరాల కోసమే ఇలాంటి వ్యాఖ్యలు చేశారేమోననిపిస్తున్నది. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ నుంచి లౌకిక, సోషలిజం.. టీడీపీ నుంచి ప్రాంతీయ సంక్షేమవాదం నేర్చుకున్న చంద్రబాబు ఎన్నికల సమయంలో తన స్వలాభం కోసం ఎన్డీయేతో పొత్తులు పెట్టుకోవడం లాంటివి గమనిస్తే అన్నీ తన అవసరాల మేరకే ఉపయోగించుకున్నట్లు అనిపిస్తుంది.
ఇక్కడ మనం గమనించాల్సిన మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే.. 1995 నుంచి 2004 మధ్య చంద్రబాబు పదవిలో ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (జీఎస్‌డీపీ) ఏటా 10.5 శాతం పెరగడం విశేషం. 2025లోనూ ఏపీ సీఎంగా చంద్రబాబు తన పాలనా మార్క్‌ను చూపిస్తూనే వస్తున్నారు.
మరోవైపు విమర్శకులు మాత్రం చంద్రబాబు చర్యలను సంకీర్ణ స్థిరత్వం కోసమే ‘లెఫ్ట్ నుంచి రైట్‌కు’ మారిన భావజాలంలా చూస్తున్నారు. ఏదీ ఏమైనా తన నాలుగు దశాబ్దాలకు పైగా రాజకీయ జీవితంలో చంద్రబాబు తాను నేర్చుకున్న లౌకిక మూలాలు, ఆచరణాత్మక జాతీయవాదమనే మిశ్రమాన్ని బలంగా నొక్కి చెప్పారు.
వీజేఎం దివాకర్