26 August, 2026 | 12:45 AM

కాసేపట్లో చంద్రబాబు ప్రమాణస్వీకారం.. సర్వం సిద్ధం

12-06-2024 10:50 AM

అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు బుధవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఉదయం 11.27 గంటలకు ఆయన ప్రమాణానికి ముహుర్తం నిర్ణయించిన విషయం తెలిసిందే. గన్నవరం ఎయిర్ పోర్టు సమీపంలోని కేసరపల్లి ఐటి పార్క్ వద్ద చంద్రబాబు ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరుగనుంది.  11.18 ఎకరాల్లో ప్రమాణ సభ ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. వేదిక అందరికీ కనిపించేలా 36 గ్యాలరీల్లో ఎల్ఈడీ తెరలను ఏర్పాటు చేశారు. వేదికపై 36 మంది ఆసీనులయ్యే అవకాశం ఉంది.

చంద్రబాబు ప్రమాణానికి ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా, వెంకటయ్య నాయుడు, మాజీ సీజేఐ ఎన్.వి రమణ, కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, నితిన్ గడ్కారీ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రలు మోహన్, శిందే, తమిళిసై, కిషన్ రెడ్డి, బండి సంజయ్, తమిళనాడు మాజీ సీఎం పన్నీర్ సెల్వం, చిరంజీవి, రజినీకాంత్ తదితర  వీవీఐపీలు హాజరు కానున్నారు. దీంతో పోలీసులు 10 వేల మంది సిబ్బందితో భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. వారి కోసం ప్రత్యేకంగా మూడు గ్యాలరీలు సిద్ధం చేశారు. 56 ఎకరాల్లో ఐదు చోట్ల వాహనల పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేశారు.  సభ ప్రాంగణం వద్దకు ఉదయాన్నే వేలాదిగా తెలుగు దేశం శ్రేణులు అధిక సంఖ్యలో రావడతో విజయవాడ - గన్నవరం రహదారి రద్దీగా మారింది. అంతర్గత రహదారుల నుంచి హైవే పైకి వచ్చే మార్గాల్లో భారీగా వాహనాలు పెద్దఎత్తున తరలిరావడంతో కనకదుర్గ వారధిపై వందలాదిగా వాహనాలు నిలిచిపోయ్యాయి.