అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లర్ అరెస్ట్
- 1.25 కోట్ల విలువైన గంజాయి స్వాధీనం
- వివరాలు వెల్లడించిన వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత
మహబూబాబాద్, ఆగస్టు 25 (విజయక్రాంతి): వరంగల్ నగర పోలీసులు అంతర్ రాష్ట్ర గంజాయి స్మగ్లింగ్ గుట్టు రట్టు చేశారు. వరంగల్ ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ ఆధ్వర్యంలో హనుమకొండ జిల్లా దామెర పోలీసులు అంతర్రాష్ట్ర స్మగ్లర్‌ను అరెస్టు చేసి 1.25 కోట్ల విలువ చేసే 251 కిలోల గంజాయిని, ద్విచక్ర వాహనాన్ని, తొమ్మిది వేల రూపాయల నగదు, ఒక సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు నగర పోలీస్ కమిషనర్ శ్వేత మంగళవారం విలేకరుల సమావేశంలో తెలిపారు.
పులుకుర్తి గ్రామానికి చెందిన ముదిగొండ నాగేశ్వర్ రావు సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశ్యంతో తనకున్న పరిచయాలతో ఒడిషా రాష్ట్రానికి చెందిన రమేష్, సుధాకర్ వద్ద తక్కువ ధరకు గంజాయి కోనుగోలు చేసి తెలంగాణ, మహరాష్ట్ర, కర్ణాటక, అంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించి నిందితులు ఉర్దు, రాందాస్ శేషరావు బీరదార్, అక్లీం, షారుఖ్‌ఖాన్, షేక్ అక్బర్, నునావత్ రాజుల ద్వారా ఎక్కువ ధరకు విక్రయించినట్లుగా విచారణలో తేలిందన్నారు.
పోలీసులకు పట్టుబడిన నిందితుడు ఇచ్చిన సమాచారంతో అతని ఇంటి నుంచి 1 కోటి 25లక్షల రూపాయల విలువ గల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని, గంజాయి కొనుగోలు చేసిన ఇతర రాష్ట్రాలకు చెందిన నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేకబృందాలను రంగంలోకి దింపామన్నారు.
గంజాయి స్మగ్లర్‌ను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన పరకాల ఏసీపీ సతీష్ బాబు, శాయంపేట సర్కిల్ ఇన్స్‌పెక్టర్ సుధాకర్ రెడ్డి, ఆత్మకూర్ ఇన్స్‌పెక్టర్ సంతోష్, దామెర ఎస్‌ఐ వీరభద్రరావు, శాయంపేట ఎస్‌ఐ పరమేశ్వర్, పరకాల ఎస్‌ఐ రఘుపతితో పాటు ఏఏఓ సల్మాన్ పాషా, దామెర, శాయంపేట కానిస్టేబుళ్ళను సీపీ శ్వేత అభినందించారు.






