26 August, 2026 | 4:55 AM

ఇందిరమ్మ టవర్స్‌కు టెండర్లు పూర్తి

26-08-2026 12:41 AM
  1. అర్హులైన దరఖాస్తుదారుల సమక్షంలో 
  2. రేపటి నుంచి 30 వరకు పారదర్శకంగా లక్కీ డ్రా 
  3. హౌసింగ్‌శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి 

హైదరాబాద్, ఆగస్టు 25 (విజయక్రాంతి): క్యూర్ పరిధిలో సొంతింటి కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న నిరుపేద కుటుంబాల కలలను నిజం చేసే దిశగా ప్రభుత్వం మరో కీలక అడుగు వేసిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు ఇందిరమ్మ టవర్స్ నిర్మాణ కార్యక్రమాన్ని వేగవంతం చేశామని వెల్లడించారు. మంగళవారం సచివాలయంలో హౌసింగ్‌శాఖ ఉన్నతాధికారులతో మంత్రి పొంగులేటి సమీక్ష నిర్వహించారు.

ఇందిరమ్మ టవర్స్ నిర్మాణ పురోగతి, లబ్ధిదారుల ఎంపిక, లక్కీ డ్రా నిర్వహణ, కొత్త నియోజకవర్గాల్లో దరఖాస్తుల స్వీకరణ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి ఇప్పటికే టెండర్లు ప్రక్రియను పూర్తిచేశామని, క్యూర్ పరిధిలోని తొలి విడతలో ప్రయోగాత్మకంగా 16 నియోజకవర్గాల్లో 807.40 కోట్ల అంచనాతో ఇందిరమ్మ టవర్స్ నిర్మిస్తున్నామని వివరించారు.

జూన్ 20 నుంచి ఆగస్టు 15 వరకు దరఖాస్తులను స్వీకరించగా మొత్తం 60,720 దరఖాస్తులు అందాయని, వచ్చిన దరఖాస్తులపై 360 డిగ్రీల క్షేత్రస్థాయి పరిశీలన, సమగ్ర విచారణ అనంతరం 40,900 మందిని అర్హులుగా గుర్తించామన్నారు. అనర్హతకు గల కారణాలను దరఖాస్తులవారీగా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్టు తెలిపారు.

ఈ నెల 27, 28, 29, 30 తేదీల్లో ఆయా ప్రాంతాల్లోని ప్రత్యేక ఫంక్షన్ హాళ్లలో ప్రజలు, అర్హులైన దరఖాస్తుదారుల సమక్షంలోనే పారదర్శకంగా లక్కీ డ్రా నిర్వహిస్తామని చెప్పారు. లక్కీ డ్రా ద్వారా లబ్ధిదారుల తుది జాబితా ప్రకటించిన తర్వాత ఎంపిక కాని దరఖాస్తుదారులకు వారు చెల్లించిన రూ.10,000 ఈఎండీని వెంటనే వారి ఖాతాల్లోకి తిరిగి జమచేస్తామన్నారు. 

మరో 4 నియోజకవర్గాల్లో స్థలాల ఎంపిక

క్యూర్ పరిధిలో కొత్తగా మరో నాలుగు నియోజకవర్గాల్లో ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి స్థలాలను ఎంపిక చేశామని మంత్రి తెలిపారు. ఒక్కో నియోజకవర్గంలో 480 ఇళ్ల చొప్పున మొత్తం 1,920 ఇళ్లను నిర్మించేందుకు చర్యలు చేపట్టినట్లు వివరించారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో హయత్‌నగర్ గ్రామంలోని అమంగల్, గోషామహల్ నియోజకవర్గంలోని నాంపల్లి, ముషీరాబాద్ నియోజకవర్గంలోని జమిస్తాన్పూర్ (ఆర్టీసీ క్వార్టర్స్), చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలోని బండ్లగూడలో ఇళ్లు నిర్మించేందుకు వీలుగా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామన్నారు.

ఈ నాలుగు నియోజకవర్గాల పరిధిలోని అర్హులైన ప్రజలు ఇందిరమ్మ టవర్స్ కోసం సెప్టెంబర్ 3లోగా దరఖాస్తు చేసుకోవాలని మంత్రి తెలిపారు. గతంలో 16 నియోజకవర్గాలకు వర్తింపజేసిన నిబంధనలే ఈ కొత్త దరఖాస్తులకూ వర్తిస్తాయన్నారు. ప్రతిపాదిత ప్లాట్ విస్తీర్ణం 525 చదరపు అడుగులు. అన్‌డివైడెడ్ షేర్ విధానంలో సుమారు 20 నుంచి -25 గజాల స్థలం లబ్ధిదారుల పేరుతో ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయనున్నామని తెలిపారు.

ప్రాంతాన్ని బట్టి లబ్ధిదారులకు అందే భూమి విలువ రూ.60 లక్షల నుంచి రూ.కోటికి పైగా ఉండనుందన్నారు. ఇంటి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షల పూర్తి సబ్సిడీ అందిస్తోందని, లబ్ధిదారుడి వాటా రూ.6 లక్షలు మాత్రమేనని, అది కూడా నాలుగు విడతల్లో చెల్లించేలా అవకాశం కల్పించామన్నారు.

లక్కీడ్రా తేదీలు, ప్రాంతాలు

* 27న రాయదుర్గం, కేపీహెచ్‌బీ కాల నీ, మైలార్‌దేవ్‌పల్లి, రెడ్ హిల్స్

* 28న కౌకూర్, పాటిగడ్డ, జల్‌పల్లి, కుల్సుంపుర 

* 29న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే కాలనీ, బోయన్‌పల్లి, బండ్లగూడ (ఎల్‌ఐజీ కాలనీ), నందిముసలిగుడ.

* 30న గాజులరామారం, అంబర్‌పేటలోని సిటీపోలీస్ లైన్స్, గడ్డిన్నా రం, ఆర్బీ క్వార్టర్స్, పోచారం (ఎల్‌ఐజీ కాలనీ).