కాంగ్రెస్ ప్రజాపాలనతో మార్పు మొదలైంది

29-04-2024 01:38:19 AM

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ

కామారెడ్డిలో నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం

కార్యక్రమానికి హాజరైన జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి

కామారెడ్డి, ఏప్రిల్ 28 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రజాపాలనతో  రాష్ట్రంలో మార్పు మొదలైందని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ పేర్కొన్నారు. ఆదివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశానికి షబ్బీర్ అలీ ముఖ్యఅతిథిగా హజరై మాట్లాడారు. రైతుల కోసం రైతు పెట్టుబడి సాయం చేయడంతో పాటు రైతు కమిషన్ ఏర్పాటు చేశా మన్నారు. పంటల భీమా పథకం ప్రారంభించినట్లు తెలిపారు. లక్షకు పైగా ధరణి సమస్యలను పరిష్కారించినట్లు చెప్పారు. కౌలు రైతుల రక్షణకు చట్టం తేవడానికి చర్యలు చేపట్టినట్లు తెలిపారు. 

ఎక్కడైన అభివృద్ధి చేశారా?

బీబీపాటిల్‌కు 10 ఏండ్లు అధికారం ఇస్తే కామారెడ్డికి ఒక్క సారి కూడా రాలేదన్నారు. అన్ని వర్గాల కార్పొరేషన్ల ద్వారా ఉపాధికోసం నిధులు మంజూరు చేస్తామన్నారు. ధరణి ద్వారా కోల్పోయిన భూములను కాపాడుతామని తెలిపారు. కాంగ్రెస్  అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు బీజేపి పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైన అమలు చేస్తున్నారాని ప్రశ్నించారు. జహీరాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సురేష్ షెట్కార్ మాట్లాడుతూ... బీబీపాటిల్ పదేళ్ల పాలనలో ఎక్కడైన అభివృద్ది చేశారాని అన్నారు. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న సామెతలా అభివృద్ది జరగలేదని ఆరోపించారు. దేశ భద్రత కోసం ఇందిరాగాంధీ చైనా, పాకిస్తాన్‌పై యుద్ధం చేశారని గుర్తుచేశారు. త్యాగాల చర్రిత కాంగ్రెస్ పార్టీకి స్వంతమన్నారు. ఇందిరమ్మ రాజ్యం రావాలంటే, అందరికీ సుపరిపాలన కావాలంటే కాంగ్రెస్‌ను గెలపించాలని ప్రజలను కోరారు. కార్యక్రమం లో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్‌రావు పాల్గొన్నారు.

పదేళ్ల పాలనలో వందేళ్ల విధ్వంసం...!

మోదీ పాలనలో దేశం వికసిత భారత్ కాలేదని, ఆర్థిక భారత్ కాలేదని ఆకలి భారత్‌గా మిగిలిందని షబ్బీర్ అలీ దుయ్యబట్టారు. కొలవుల భారత్ కాదు, నిరుద్యోగ విలపిత భారత్‌గా మారిందని ఎద్దేవ చేశారు. పదేళ్ల మోదీ పాలనలో వందేళ్ల విధ్వంసం జరిగిందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ షెట్కార్‌ను పార్లమెంట్‌కు పంపిస్తే కామారెడ్డికి త్రాగునీరు, సాగునీరు తెప్పిస్తానని హామీ ఇచ్చారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రాణాహిత చేవెళ్ల పథకాన్ని నిలిపివేసిందన్నారు. లేకుంటే కామారెడ్డిలో 3 లక్షల ఎకరాలకు సాగునీరు వచ్చేదన్నారు.