చార్‌ధామ్ యాత్రలో విషాదం
హుజూరాబాద్, మే 29: హుజూరాబాద్ పట్టణంలో ఆయిల్‌మిల్ వ్యాపారి, పెద్దపాపయ్యపల్లికి చెందిన నార్ల కృష్ణమూర్తి(70) ఇటీ వల చార్‌ధామ్ యాత్రకు వెళ్లి అస్వస్థతకు గురై గుండెపోటుతో బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బద్రినాథ్, కేదారినాథ్, అమర్‌నాథ్ పుణ్యక్షేత్రాలు సందర్శనకు కృష్ణమూర్తి ఇతర యాత్రీకులతో కలిసి ఈ నెల 25వ తేదీన బయలుదేరి వెళ్లారు. అక్కడ అస్వస్థతకు గురై గుండెపోటుతో కృష్ణమూర్తి మృతిచెందినట్లు తెలిసింది.
కృష్ణమూర్తి 40 ఏళ్లుగా హుజూరాబాద్‌లో ఆయిల్ మిల్ నడుపుతున్నారు. ఆయనకు స్థానిక వ్యాపారవర్గాల్లో మంచి పేరు ఉంది. సౌమ్యుడిగా, వివాదారహితుడిగా గుర్తింపు ఉంది. ఆయన మృతితో హుజూరాబాద్ వ్యాపారవర్గాల్లో, ఆర్యవైశ్య సామాజిక వర్గంలో విషాదం నెలకొంది. ఆయన మృతికి పలువురు సంతాపం వెలిబుచ్చారు. కృష్ణమూర్తికి భార్య, ఒక కుమారుడు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. ఆయన మృతదేహం గురువారం స్వగ్రామానికి చేరుకోను న్నట్లు బంధువుల ద్వారా తెలిసింది.






