అమర్‌సింగ్‌పై కిడ్నాప్ కేసు నమోదు
కార్పొరేటర్లతో పాటు మరి కొందరిపై కూడా
మేడిపల్లి, మే 23 (విజయక్రాంతి) : పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ జక్క వెంకట్‌రెడ్డిని కిడ్నాప్ చేసేందుకు యత్నించిన కార్పొరేటర్ అమర్‌సింగ్‌పై కిడ్నాప్ కేసు నమోదైంది. అమర్ సింగ్‌తో పాటు అతనికి సహకరించిన మరికొందరు కార్పొరేటర్లు, మహిళా కార్పొరేటర్ల భర్తలు, నాయకులపై కిడ్నప్, దాడి కేసులు నమోదు అయ్యాయి. వివరాల్లోలకి వెళితే.. రాష్ట్రంలోని అనేక స్థానిక సంస్థల్లో ప్రస్తుతం అవిశ్వాసం రగడ నడుస్తుంది. ఈ క్రమంలోనే పీర్జాదిగూడ మేయర్ కుర్చిపై కాంగ్రెస్ కన్నేసింది. అయితే జూన్ 5వ తేదీన బల నిరూపణ చేసుకోవాలని ఆదేశిస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
మేయర్ జక్క వెంకట్ రెడ్డికి మెజార్టీ కార్పొరేటర్ల బలం ఉండటంతో మేయర్ కుర్చి కోసం ఆశపడిన కార్పొరేటర్ అమర్ సింగ్ మేయర్‌తో పాటు అతని వర్గంలో ఉన్న కార్పొరేటర్లను బెదిరించి కిడ్నప్ చేయాలని పథకం పన్నాడు. ఈ క్రమంలోనే ఈ నెల 19వ తేదీన ఔటర్ రింగు రోడ్డుపై మేయర్ జక్క వెంకట్‌రెడ్డి, తనవర్గం కార్పొరేటర్లు ప్రయాణిస్తున్న కార్లను సుమారు 20 కార్లలో వచ్చిన అమర్‌సింగ్ అండ్ గ్యాంగ్ మేయర్, కార్పొరేటర్ల కిడ్నప్‌కు యత్నించాడు. అయితే మేయర్ వర్గం అడ్డుకోవడంతో దాడులకు దిగారు.
ఈ ఘటనపై మేయర్ జక్క వెంకట్ రెడ్డి, అతని మద్ధతుగా ఉన్న కార్పొరేటర్లు బీఆర్‌ఎస్ పార్టీ తరుపున ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ చేసిన ఘట్‌కేసర్ పోలీసులు అమర్ సింగ్‌ను ఏ1గా, 13వ డివిజన్ కార్పొరేటర్ భర్త తూంకుంట శ్రీధర్ రెడ్డిని ఏ2గా, 22వ డివిజన్ కార్పొరేటర్ భీంరెడ్డి నవీన్‌రెడ్డిని ఏ3గా, 7వ డివిజన్ కార్పొరేటర్ భర్త మాడ్గుల చంద్రారెడ్డిని ఏ4గా, కో ఆప్షన్ సభ్యులు చిలుముల జగదీశ్వర్ రెడ్డిని ఏ5గా, 26వ డివిజన్ కార్పొరేటర్ భర్త పప్పుల అంజిరెడ్డిని ఏ6గా, డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్‌ను ఏ7గా, కాంగ్రెస్ కార్యకర్త నర్సింహరెడ్డిని ఏ8గా చేర్చడంతో పాటు ఆ వ్యవహారంలో భాగస్వామ్యం ఉన్న మరికొందరిపై 365, 147 ఆర్/డబ్ల్యూ, 511 ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.






