27 February, 2026 | 1:55 PM

వెంకటాపురంలో కోతుల బెడదకు చెక్

27-02-2026 12:00 AM

వెంకటాపూర్, ఫిబ్రవరి 26 (విజయక్రాంతి): ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో గత కొంతకాలంగా కోతుల బెడద తీవ్రరూపం దాల్చడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్ల పైకప్పులపైకి ఎక్కడం, వంటగదుల్లోకి చొరబడి ఆహార పదార్థాలు అపహరించడం, చిన్నారులు, వృద్ధులను భయభ్రాంతులకు గురిచేయడం వంటి ఘటనలు తరచూ చోటుచేసుకోవడంతో ప్రజలు బయటకు రావడానికే భయపడే పరిస్థితి నెలకొంది.

విద్యార్థులు పాఠశాలకు వెళ్లే పరిస్థితి లేకపోవడం, అలాగే వ్యవసాయ పనులకు వెళ్లే వారికి సైతం ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ సమస్యను తొలగించడానికి గ్రామ సర్పంచ్ మామిడిశెట్టి సుగుణ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు చేపట్టారు. గ్రామస్తుల ఫిర్యాదుల మేరకు సంబంధిత అధికారులను సంప్రదించి, ప్రత్యేకంగా కోతులను పట్టే నిపుణుల బృందాన్ని పిలిపించారు.

ఉదయం నుంచే గ్రామంలోని పలు ప్రాంతాల్లో గాలింపు చేపట్టి కోతులను సురక్షితంగా బోనుల్లో బంధించి, పట్టుకున్న కోతులను అటవీ ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేసినట్లు సుగుణ తెలిపారు. గ్రామ ప్రజల భద్రత మా మొదటి ప్రాధాన్యత అని, మిగిలిపోయిన కోతులను వెతికి పట్టుకుంటున్నట్లు, భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రాజు, రామప్ప ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ ఐలయ్య, ఎన్ యు ఐ జిల్లా అధ్యక్షుడు కోటి, గ్రామ కమిటీ అధ్యక్షుడు శ్రీను, కాంగ్రెస్ సీనియర్ నాయకులు స్వామి, రాజిరెడ్డి గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.