16-02-2026 07:04:55 PM
బిఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు తెలిపిన కాంగ్రెస్ అభ్యర్థి
చేర్యాల: చేర్యాల పట్టణంలోని పాత ప్రభుత్వ ఆసుపత్రి కార్యాలయంలో నోడల్ ఆఫీసర్ డిపిఓ రవీందర్ ఆధ్వర్యంలో సోమవారం చైర్మన్ వైస్ చైర్మన్ పదవులకు ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికకు బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు ఏడుగురు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు ఐదుగురు హాజరయ్యారు. నూతనంగా ఎన్నికైన 12 వార్డుల కౌన్సిలర్లతో ప్రమాణ స్వీకారం చేయించారు.
చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించగా మున్సిపల్ చైర్ పర్సన్ గా బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఆరవ వార్డు కౌన్సిలర్ ముస్త్యాల అరుణను రెండవ వార్డు కౌన్సిలర్ కమలాపురం గీతాంజలి ప్రతిపాదించగా తొమ్మిదవ వార్డు కౌన్సిలర్ వీరబత్తిని సదానందం బలపరచగా బిఆర్ఎస్ పార్టీకి చెందిన ఎదుగురితో పాటు కాంగ్రెస్ కు చెందిన ఒకటవ వార్డు కౌన్సిలర్ ఒగ్గు వెంకటమ్మ కూడా చేతి లేపడంతో ఎనిమిది మంది సభ్యులు అరుణను చైర్మన్ గా ఎన్నుకోవడంతో అధికారులు ముస్త్యాల అరుణను చైర్ పర్సన్ గా ప్రకటించారు.
వైస్ చైర్మన్ పదవికి పదవ వార్డు అభ్యర్థిని మేడిశెట్టి ఉమా శ్రీధర్ పేరును నాలుగో వార్డు కౌన్సిలర్ నిమ్మ సుప్రజా రాజీవ్ రెడ్డి ప్రతిపాదించగా పదకొండు వార్డు కౌన్సిలర్ ఇజాజ్ అహ్మద్ బలపరచగా బిఆర్ఎస్ పార్టీ చెందిన ఏడుగురు సభ్యులు చేతులు ఎత్తగా ఆమెను వైస్ చైర్మన్ గా అధికారులు ప్రకటించారు. ఎన్నిక సమయంలో ఆసక్తి గల సంఘటన చోటు చేసుకుంది చైర్మన్ ఎన్నిక జరుగుతున్న క్రమంలో బీఆర్ఎస్ పార్టీకి సరిపోయే బలం ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఐదుగురు కౌన్సిలర్లలో ఒకటవ వార్డు కౌన్సిలర్ గా గెలుపొందిన ఒగ్గు వెంకటమ్మ చేతి ఎత్తి ఓటు వేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
సమావేశంలో పార్టీ కండువా వేసుకోకపోవడం అనుమానాలకు తావిచ్చింది. ఎన్నిక అనంతరం అధికారులు చైర్ పర్సన్ ముస్త్యాల అరుణ, వైస్ చైర్ పర్సన్ మెడిశెట్టి ఉమా లతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నాగేందర్, సీనియర్ అసిస్టెంట్ కృష్ణ ఎన్నిక సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా హుస్నాబాద్ ఏసీపీ సదానందం ఆధ్వర్యంలో చేర్యాల సిఐ రమేష్,ఎస్సై నవీన్ తో పోలీస్ సిబ్బంది భారీ బందోబస్తు నిర్వహించారు.