calender_icon.png 19 January, 2026 | 5:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్నికల బీ- ఇచ్చేది నేనే

19-01-2026 01:31:16 AM

భీంభరత్ స్పష్టం

ఎమ్మెల్యే కాలె యాదయ్య ఆరోపణలను రుజువు చేయాలి.. లేదంటే క్షమాపణ చెప్పాలి

చేవెళ్ల కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జ్ పామెన భీంభరత్ సవాల్

మొయినాబాద్, జనవరి 18 (విజయక్రాంతి): తనపై అసత్య ఆరోపణలు చేస్తున్న చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్యపై కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జ్ పామెన భీంభరత్ నిప్పులు చెరిగారు. తనపై చేసిన ఆరోపణలను రుజువు చేయాలని, లేనిపక్షంలో చేవెళ్ల మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం సాక్షిగా బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆదివారం మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మున్సిపల్ ఎన్నిక లో బీ-ఫారాలపై క్లారిటీ ఇచ్చారు. త్వరలో రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో చేవెళ్ల నియోజకవర్గంలోని మూడు మున్సిపాలిటీల్లో పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థులకు పార్టీ తరపున బీ-ఫారాలు తానే ఇస్తానని భీంభరత్ స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎవరికీ సందేహాలు అవసరం లేదని, అవసరమైతే అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని పేర్కొన్నారు.

ఎమ్మెల్యే తీరుపై విమర్శలు

2014లో కాంగ్రెస్ తరపున గెలిచి పార్టీ మారిన కాలె యాదయ్య, నాడు కాంగ్రెస్ కార్యకర్తలను అనేక ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు. తనపై పీడీ యాక్ట్ పెట్టడమే కాకుండా, ఎన్కౌంటర్ చేసేందుకు కూడా ప్రయత్నించారని భీంభరత్ తీవ్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ కోసం తాను అంకితభావం  పని చేశానని చెప్పారు. 2018లో ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరినప్పటి నుండి, ఎందరు పార్టీ వీడినా తాను మాత్రం కాంగ్రెస్ బలోపేతం కోసమే పనిచేస్తున్నానని తెలిపారు. షాబాద్ మండలంలో పార్టీ పరిస్థితి క్లిష్టంగా ఉన్న సమయంలో సర్పంచ్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిపించుకున్న విషయాన్ని గుర్తుచేశారు.

తాను డబ్బుల వసూలు ఆరోపణలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఎక్కడా డబ్బులు వసూలు చేయలేదని, తన ప్రతిష్టను దెబ్బతీయాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఎమ్మెల్యేగా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజలకు మంచి పనులు చేయాలని కాలె యాదయ్యకు సూచించారు. మున్సిపల్ ఎన్నికల్లో అన్ని వార్డుల్లో ప్రచారం నిర్వహించి కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని భీంభరత్ ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో రాష్ట్ర అధికార ప్రతినిధి గౌరి సతీష్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు తమ్మలి మానయ్య, ఉపాధ్యక్షుడు మర్రి రవీందర్ రెడ్డి, పురాణం భద్రస్వామి, బైకని కుమార్ యాదవ్ తదితర నాయకులు పాల్గొన్నారు.