calender_icon.png 19 January, 2026 | 7:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ పరువు తీస్తున్నరు!

19-01-2026 01:15:07 AM

రాష్ట్రంలో పని చేయడానికి మహిళా అధికారులు భయపడుతున్నారు

మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మారెడ్డి

హైదరాబాద్, జనవరి 18 (విజయక్రాంతి): రాష్ట్రంలో మంత్రులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ మహిళా ఐఏఎస్ అధికా రుల పరువును బజారుకు ఈడుస్తున్నారని మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మారెడ్డి మండిపడ్డారు. ఈ పరిణామాల వల్ల మహిళా అధికారులు రాష్ట్రంలో పని చేయడానికే భయపడుతున్నారని, ఫలితంగా దేశవ్యాప్తంగా తెలంగాణ పరువు పోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. శనివారం మహబూబ్‌నగర్‌లో సీఎం చేసిన వ్యాఖ్యలు పూర్తిగా ఎన్నికల ప్రసంగంలా ఉన్నాయని ఎద్దేవా చేశారు. ఎన్నికలు సమీపించినప్పుడే సీఎంకు పథకాలు గుర్తుకొ స్తాయని, మున్సిపల్ ఎన్నికల కోసమే మళ్లీ చీరల పంపిణీ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చార ని విమర్శించారు. పంచాయతీ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో, బీఆర్‌ఎస్‌ను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్, బీజేపీలు ఒక్కటయ్యాయని ఆరోపించారు. కేసీఆర్ పాలనలోనే పాలమూరు ముఖచిత్రం మారిందని గుర్తు చేశారు. 

తెలంగాణకు దైవం కేసీఆర్ అని, ఆయన తెలంగాణను తీసుకురాకపోతే రేవంత్‌రెడ్డి సీఎం అయ్యేవారా అని ప్రశ్నించారు. హరీష్‌రావు, కేటీఆర్‌లను మారీచుడు, సుబాహుడు అంటూ వ్యాఖ్యానించడం సీఎం స్థాయికి తగదని హితవు పలికారు. పాలమూరు రంగారెడ్ది ప్రాజెక్టుకు ఏడు అనుమతులు వచ్చాయని, దమ్ముంటే మిగిలిన అనుమతిని సాధించి 90 టీఎంసీల నీళ్లు తీసుకురావాలని మంత్రులకు సవాల్ విసిరారు. మంత్రులు అశోక్‌నగర్ లైబ్రరీని సందర్శించగలరా అని ప్రశ్నించారు. ప్రజలు మోసపోయి కాంగ్రెస్‌కు ఓట్లు వేస్తే మళ్లీ పాత రోజులే వస్తాయని హెచ్చరించారు. జిల్లాలను రద్దు చేయడమే ఈ ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోందని విమర్శించారు.