13 July, 2026 | 2:52 AM

చేవెళ్ల నరమేధం

13-07-2026 02:04 AM
  1. రూ.20 లక్షల డీల్?
  2. కత్తికి సాన పట్టిందెవరు?

ఆరుగురిని బలితీసుకున్న ఉన్మాదం వెనుక అసలు సూత్రధారులు ఎవరు?

వణుకుతున్న గ్రామం.. 

పోలీసుల అదుపులో నలుగురు?

చేవెళ్ల, జూలై 12 (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలో మానవత్వం మంటగలిసింది. షాబాద్ మండలం నాగరకుంట అనుబంధ గ్రామమైన దైవాలగూడలో అర్ధరాత్రి వేళ ఓ ఉన్మాది సృష్టించిన నరమేధం తెలుగు రాష్ట్రాలను ఉలిక్కిపడేలా చేసింది. కట్టుకున్న భార్య, కన్నబిడ్డలతో పాటు ఒకే కుటుంబానికి చెందిన మైనర్ బాలిక సహా ఆరుగురిని కిరాతకంగా నరికి చంపిన రాజ్ కుమార్ అనే ఉన్మాది ఉదంతం వెనుక.. వ్యవస్థల నిర్లక్ష్యం, రాజకీయ అండదండలు, భారీ నగదు లావాదేవీలు ఉన్నాయనే సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి.

రూ. 20 లక్షలతో పోక్సో కేసు నీరుగారిందా?

మైనర్ బాలికను ప్రేమ పేరుతో వేధిస్తూ, ఆ కుటుంబాన్ని భయభ్రాంతులకు గురిచేసిన నిందితుడు రాజ్ కుమార్ పై గత మే 16న షాబాద్ పోలీస్ స్టేషన్లో పోక్సో కేసు నమోదైంది. నాన్-బెయిలబుల్ కేసు అయినప్పటికీ, పోలీసులు సెక్షన్ల తీవ్రతను తగ్గించి నిందితుడికి ముందస్తు బెయిల్(యాంటిసిపేటరీ బెయిల్) వచ్చేలా సహకరించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

దీనికోసం నిందితుడు ఏకంగా రూ. 20 లక్షలు పోలీసులకు లంచంగా ఇచ్చాడని, దీని వెనుక స్థానిక రాజకీయ నాయకుల హస్తం ఉందనే ప్రచారం స్థానికంగా జోరుగా సాగుతోంది. తనపై ఫిర్యాదు చేసినందుకే కక్ష పెంచుకున్న నిందితుడు, బెయ్పి బయట తిరుగుతూ ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. తమకు ప్రాణహాని ఉందని బాధితులు పలుమార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోకపోవడమే ఈ ఆరుగురి ప్రాణాలు పోవడానికి కారణమని బంధువులు ఆక్రోశిస్తున్నారు.

కత్తికి సాన పట్టారా? ఆ రాత్రి ఏం జరిగింది?

ఈ దారుణ హత్యల వెనుక పక్కా స్కెచ్ ఉన్నట్లు తెలుస్తోంది. హత్యకు ఉపయోగించిన కత్తికి రాజ్ కుమార్ కు అత్యంత ఆప్తుడైన ఒక వ్యక్తి సానపెట్టి ఇచ్చినట్లు వదంతులు వినిపిస్తున్నాయి.

సీసీటీవీ విజువల్స్ షాక్:

అర్ధరాత్రి 11 గంటల సమయంలో యు వకులు ఎవరూ లేని సమయం చూసి.. స్టేడి యం లోపల కార్ పార్క్ చేసిన ఉన్మాది, మై నర్ బాలిక ఇంట్లోకి చొరబడ్డాడు. అడ్డువచ్చి న తల్లిని, నానమ్మను నరికి చంపి, అమ్మాయిని బలవంతంగా తీసుకెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. స్టేడియం ప్రాంతం ఖాళీగా ఉందని ఉన్మాదికి సమాచారం చేరవేసిన ఆ ‘ఇన్ఫార్మర్‘ ఎవరు? కత్తికి సానపట్టింది ఎవరు? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.

కన్నవారిని కాటేసిన జల్సాలు.. పొలం అమ్మి రూ. 1.80 కోట్లు!

మొదటి నుంచి జల్సాలకు అలవాటు పడిన రాజ్ కుమార్ గంజాయి, మద్యం, ఆన్లైన్ బెట్టింగ్ గేమింగ్స్ మరియు అమ్మాయిల మోజులో పడి లక్షల రూపాయల అప్పులు చేశాడు. ఈ మధ్యే తన సొంత పొలాన్ని రూ. 1 కోటి 80 లక్షలకు అమ్మి అప్పులు తీర్చాడు. మిగిలిన డబ్బుతో పోలీసులను మేనేజ్ చేసి జల్సా రాయుడిలా తిరిగాడు. పరాయి అమ్మాయిలతో చాటింగ్ చేస్తూ, ఆ విషయాలను సొంత భార్య సరితతోనే పంచుకుంటూ మానసిక వేధించేవాడని బంధువులు చెబుతున్నారు. తన వికృత చేష్టలు ఊరిలో అందరికీ తెలిసిపోయాయనే అక్కసుతోనే, కట్టుకున్న భార్యను, కన్నబిడ్డలను కూడా నిర్ధాక్షిణ్యంగా పొట్టనబెట్టుకున్నాడు.

పోలీసుల అదుపులో నలుగురు అనుమానితులు

నిందితుడి కాల్ డేటా ఆధారంగా పోలీసులు విచారణను వేగవంతం చేశారు. గత రెండు మూడు రోజులుగా రాజ్ కుమార్ తో నిరంతరం టచ్లో ఉన్న షాబాద్కు చెందిన అరుణ్, శ్రీకాంత్లతో పాటు మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. వీరికి హత్యలతో సంబంధం ఉందా? ముందే సమాచారం తెలుసా? అనే కోణంలో విచారిస్తున్నారు. అలాగే నిందితుడు పారిపోవడానికి ఉపయోగించిన సెల్ఫ్ డ్రైవింగ్ కారును అద్దెకు ఇచ్చిన ఫరూక్ నగర్ కంసాన్ పల్లికి చెందిన వ్యక్తిని కూడా మరో చోట విచారిస్తున్నట్లు సమాచారం.

సర్పంచ్ పై బంధువుల ఫిర్యాదు.. ఉద్రిక్తంగా అంత్యక్రియలు

శనివారం పోస్టుమార్టం పూర్తయిన తర్వాత బాధితుల బంధువుల ప్రమేయం లేకుండా, మృతదేహాలను గ్రామపంచాయతీ ట్రాక్టర్లో తరలించడం తీవ్ర దుమారం రేపింది. బంధువుల అనుమతి లేకుండా డెడ్ బాడీలను తరలించినందుకు గాను షాబాద్ గ్రామ సర్ప్ంప బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

న్యాయం జరిగే వరకు మృతదేహాలను తీసుకునేది లేదని బంధువులు భీష్మించుకోవడంతో శనివారం రాత్రి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. చివరకు సర్ప్ంప కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇవ్వడంతో.. రాత్రి 10:30 గంటల ప్రాంతంలో అంత్యక్రియలు ముగిశాయి.

మేనమామల కుటుంబాలకు రక్షణ ఏది?

మైనర్ బాలిక తండ్రి ఇదివరకే మరణించడంతో ఆ కుటుంబానికి మేనమామలే అండగా నిలిచారు. పోక్సో కేసు పెట్టినప్పటి నుంచి ఆ మేనమామలను కూడా చంపేస్తానని ఉన్మాది రాజ్ కుమార్ హెచ్చరించాడు. ప్రస్తుతం ఆరుగురిని చంపి ఉన్మాది పరారీలో ఉండటంతో.. ఎప్పుడు ఎటువైపు నుంచి దాడి చేస్తాడోనని మేనమామల కుటుంబాలు ప్రాణభయంతో వణుకుతున్నాయి. పోలీసులు తక్షణమే స్పందించి ఆ కుటుంబాలకు పటిష్టమైన రక్షణ కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.