17-01-2026 07:40:39 PM
దుండగుడికి కఠినంగా శిక్షించాలని ప్రజా సంఘాల నాయకుల డిమాండ్
జవహర్ నగర్,(విజయక్రాంతి): చిన్నారిపై అత్యాచారానికి పాల్పడటం దుర్మార్గమని, యావత్ సమాజం సిగ్గుపడేలా జరిగిన దుర్గఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని, ఘాతుకానికి పాల్పడిన దుర్మార్గుడిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించి శిక్షపడేలా చేయాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా పెంచికల్ పహాడ్లో నాలుగేళ్ళ చిన్నారిపై 60ఏళ్ళ వృద్ధుడు అత్యాచారానికి పాల్పడటాన్ని నిరసిస్తూ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని జవహర్ నగర్ శనివారం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా ఇప్టూ జాతీయ కన్వీనర్ షేక్షావలి మాట్లాడుతూ అమాయక చిన్నారికి చాక్లెట్, బిస్కెట్, ఆట వస్తువులు ఆశచూపి ముక్కుపచ్చలారని అమ్మాయిపై అత్యాచారం చేయడం సిగ్గుచేటని, ప్రజాస్వామికవాదులు తీవ్రంగా ఖండించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం వెంటనే చిన్నారి కుటుంబాన్ని ఆదుకునేలా యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా ప్రభుత్వం, పోలీసు యంత్రంగా కఠినంగా వ్యవహరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెర సునీత, తుమ్మరాణి, సుచరిత తదితరులు పాల్గొన్నారు.