17-01-2026 07:35:41 PM
నిర్మల్,(విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి, జిల్లాలోని నిర్మల్, భైంసా, ఖానాపూర్ మున్సిపాలిటీల వార్డుల మహిళా రిజర్వేషన్లను శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఖరారు చేశారు. వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ స్వయంగా పాల్గొని, మున్సిపాలిటీలలో వార్డుల వారిగా కేటాయించిన రిజర్వేషన్ వివరాలను తెలుపుతూ, లాటరీ పద్ధతి ద్వారా ఎస్టీ, ఎస్సీ, బీసీ, జనరల్ వారీగా మహిళలకు కేటాయించే వార్డులను ఎంపిక చేశారు.
ముందుగా కలెక్టర్ మాట్లాడుతూ, నిబంధనల ప్రకారం సిపెక్ సర్వే జనాభా ఆధారంగా రిజర్వేషన్లు ఖరారు చేస్తున్నట్లు వివరించారు. ప్రక్రియను మొత్తం పకడ్బందీ వీడియోగ్రాఫ్ పర్యవేక్షణలో నిర్వహించామని వివరించారు. ఈ మహిళా రిజర్వేషన్ల ఖరారు కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, మున్సిపల్ కమిషనర్లు జగదీశ్వర్ గౌడ్, సుందర్ సింగ్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.