1 May, 2026 | 1:19 AM

చట్టబద్ధంగానే దత్తత

01-05-2026 12:05 AM

కరపోర్టల్ ద్వారానే దరఖాస్తు చేసుకోవాలి

జిల్లా అదనపు కలెక్టర్ కిరణ్మయి కొమ్మిశెట్టి వెల్లడి

జిల్లా కలెక్టరేట్లో ‘చైల్ వెల్ఫేర్ వీక్’ అవగాహన సదస్సు

రంగారెడ్డి, ఏప్రిల్ 30(విజయక్రాంతి) పిల్లలను దత్తత తీసుకోవాలనుకునే వారు తప్పనిసరిగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం కర (Central Adoption Resource Authority) పోర్టల్ ద్వారానే దరఖాస్తు చేసుకోవాలని రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ శ్రీమతి కిరణ్మయి కొమ్మిశెట్టి సూచించారు. ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ (99 రోజుల కార్యాచరణ)లో భాగంగా నిర్వహిస్తున్న చైల్ వెల్ఫేర్ వీక్ సందర్భంగా లీగల్ అడాప్షన్, ఫోస్టర్ కేర్ అంశాలపై జిల్లా కలెక్టరేట్ సెమినార్ హాల్లో ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ఇతర మార్గాల ద్వారా లేదా మధ్యవర్తుల ద్వారా దత్తత తీసుకోవడం చట్టవిరుద్ధమని, దీనివల్ల భవిష్యత్తులో అనేక చట్టపరమైన ఇబ్బందులు ఎదురవుతాయని హెచ్చరించారు. జిల్లా సంక్షేమ అధికారి మరియు డి.ఆర్.డి.ఓ శ్రీలత  మాట్లాడుతూ, త్వరగా దత్తత పొందాలనే ఆతృతతో తప్పుడు మార్గాలను ఎంచుకోవద్దని, కేవలం చట్టబద్ధమైన విధానాన్నే అనుసరించాలని కోరారు. ఈ సదస్సులో దత్తత ప్రక్రియపై పలువురు నిపుణులు డా. రమాదేవి (CWC సభ్యురాలు) దత్తత యొక్క ప్రాముఖ్యత, బాధ్యతలపై వివరించారు. సంతోష్ & ప్రేమలత (‘Where Are India’s Children‘ NGO): లీగల్ అడాప్షన్ ప్రక్రియపై వీడియో ప్రదర్శన ద్వారా దత్తత కోరే తల్లిదండ్రులకు (PAPs) అవగాహన కల్పించారు.

దత్తత సహాయ కేంద్రం ప్రారంభం

ప్రజలకు దత్తతపై తలెత్తే సందేహాలను నివృత్తి చేసేందుకు సెమినార్ హాల్ సమీపంలో ఏర్పాటు చేసిన ‘దత్తత సహాయ కేంద్రాన్ని’ అదనపు కలెక్టర్ కిరణ్మయి కొమ్మిశెట్టి, డీడబ్ల్యూఓ శ్రీలత గారు కలిసి ప్రారంభించారు. అనంతరం దత్తత విధానంపై రూపొందించిన పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో డి.సి.పి.ఓ (ౄCPO) శ్రీ ప్రవీణ్ కుమార్, జిల్లా సంక్షేమ శాఖ అధికారులు, సిబ్బంది, దత్తత కోసం దరఖాస్తు చేసుకున్న తల్లిదండ్రులు మరియు వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.