బాలల హక్కులను కాపాడాలి
రంగారెడ్డి జిల్లా ప్రధాన న్యాయమూర్తి కర్ణకుమార్-
ఎల్బీనగర్, జులై 25 : బాలల హక్కులను కాపాడాలని, వారి హక్కుల రక్షణకు అధికారులు కృషి చేయాలని రంగారెడ్డి జిల్లా న్యాయ సేవా సంస్థ చైర్మన్, ప్రధాన జిల్లా న్యాయమూర్తి కర్ణ కుమార్ సూచించారు. రంగారెడ్డి జిల్లా న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవా సంస్థ, నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సూచనలతో ప్రభుత్వ పాఠశాలల చైల్ ప్రొటెక్షన్ ఆఫీసర్లకు (ప్రభుత్వ ఉపాధ్యాయులు) శనివారం ఒకరోజు అవగాహన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా న్యాయ సేవా సంస్థ చైర్మన్, ప్రధాన జిల్లా న్యాయమూర్తి ఎ.కర్ణ కుమార్ మాట్లాడుతూ... ప్రతి పాఠశాలలో పిల్లల హక్కుల పరిరక్షణ, వారి భద్రత, విద్యా హక్కు, లైంగిక వేధింపుల నివారణ, బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన వంటి అంశాలపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. పిల్లలకు అనుకూలమైన న్యాయ సేవలు అందించడంలో చైల్ ప్రొటెక్షన్ ఆఫీసర్ల పాత్ర ఎంతో కీలకమని తెలిపారు.
పోక్సో చట్టం2012, జువెనైల్ జస్టిస్ చట్టం, బాలల హక్కులు, పిల్లలపై జరిగే లైంగిక నేరాల నివారణ, పాఠశాలల్లో పిల్లల భద్రత వంటి అంశాలపై అదనపు జిల్లా సెషన్స్ జడ్జి వినోద్ కుమార్, పోక్సో కోర్టు న్యాయమూర్తి జి.శ్రీనివాస్ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అదనపు జూనియర్ సివిల్ జడ్జి స్వర్ణ మల్లిక, బార్ అసోసియేషన్ ప్రెసిండెంట్ జి.విప్లవ్ రెడ్డి, జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి అనూష, చైల్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి, జిల్లా చైల్ ప్రొటెక్షన్ అధికారి ప్రవీణ్ కుమార్, అడ్వకేట్ విజయ భాస్కర్ రెడ్డి, డిప్యూటీ లీగల్ ఎయిడ్ కౌన్సెల్ సి.హెచ్. రవి, ప్రభుత్వ పాఠశాలల చైల్ ప్రొటెక్షన్ ఆఫీసర్లు, జిల్లా న్యాయ సేవా సంస్థ అధికారులు తదితరులు పాల్గొన్నారు.






