1 August, 2026 | 5:55 AM

తైవాన్‌ను కమ్ముకొస్తున్న చైనా

25-05-2024 01:25 AM

ద్వీపదేశం చుట్టూ డ్రాగన్ నేవీ విన్యాసాలు

తైపీ, మే 24: తైవాన్‌ను ఎప్పుడెప్పుడు తనలో కలిపేసుకోవాలా అని ఆరాటపడుతున్న డ్రాగన్ దేశం చైనా.. మరోసారి తన పొరుగు దేశంపై పగడ విప్పింది. తైవాన్‌ను అష్టదిగ్బంధనం చేస్తూ భారీ ఎత్తున నేవీ విన్యాసాలు మొదలుపెట్టింది. వరుసగా రెండోరోజు శుక్రవారం కూడా ఈ విన్యాసా లు కొనసాగినట్టు తైవాన్ ప్రభుత్వం ప్రకటించింది. బయటి శక్తుల నుంచి ఎన్ని ఒత్తిళ్లు, ప్రమాదాలు ఎదురైనా తాము స్వేచ్ఛ, స్వాతంత్య్రాలనే కోరుకొంటామని కొత్తగా ఎన్నికైన తైవాన్ అధ్యక్షుడు లై చింగ్టే ప్రకటించిన రెండు రోజులకే చైనా దురాక్రమణ కార్యక్రమం మొదలుపెట్టింది. గురువారం నుంచి శుక్రవారం వరకు 24 గంటల్లో చైనాకు చెందిన 49 యుద్ధ విమానాలు, 19 నౌకలు తైవాన్‌ను చుట్టుముట్టాయని ఆ దేశ రక్షణ శాఖ శుక్రవారం ప్రకటించింది. దీంతో ఏ క్షణం ఏం జరుగుతుందోనని తైవాన్ ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు.