మరో వివాదంలో తమిళనాడు గవర్నర్
చెన్నై, మే 24: తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవి మరో వివాదానికి తెరలేపారు. ప్రముఖ తమిళ కవి తిరువళ్లువర్ తిరునాళ్లను పురస్కరించుకొని గవర్నర్ సోషల్‌మీడియాలో పోస్ట్‌చేసిన తిరువళ్లువర్ ఫొటోపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కవి చిత్రాన్ని మొత్తం గవర్నర్ కాషాయంతో నింపేశారు. కాషాయ వస్త్రాలు ధరించి, నుదిటిన భస్మంతో ఉన్న ఆ ఫొటో ఇప్పుడు తమిళనాట సంచలనంగా మారింది. గవర్నర్ తీరుపై ద్రవిడ పార్టీలు అగ్గిమీద గుగ్గిలమవుతున్నాయి. తిరువళ్లువర్ కుల, మతాల కు అతీతుడని తమిళనాడు నేతలు ప్రకటనలు చేస్తున్నారు.
‘తిరువళ్లువర్ సామాజిక న్యాయ సిద్ధాంతానికి ప్రధా న ప్రచారకర్త. స్వయంశక్తి ద్వారానే ఎవరైనా గొప్పవాళ్లు కాగలరని చెప్పిన తాత్వికుడు. ఆయన సిద్ధాంతాలను ఎవరూ మార్చలేరు’ అని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఎక్స్‌లో పోస్టు చేశారు. ‘ఇది ఖండించవల్సిన అంశం. కవి తిరువళ్లువర్ కుల, మతాలకు అతీతుడు. రాజ్‌భవన్‌ను ఆయన (గవర్నర్) విదూషక కేంద్రంగా మార్చేస్తున్నారు’ అని ఎండీఎంకే పార్టీ అధినేత వైకో మండిపడ్డారు.






