స్వీయ గణనపై అవగాహన ర్యాలీ
మహబూబాబాద్,(విజయక్రాంతి): ప్రభుత్వ సూచనల మేరకు జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్(Collector Sneha Sabarish) ఆదేశాల మేరకు జనాభా గణన 2027 కార్యక్రమంలో శనివారం మహబూబాబాద్ పట్టణంలోని రైల్వే స్టేషన్ సెంటర్ నుండి బస్టాండ్ వరకు స్వీయ గణన మారథాన్ రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అదనపు కలెక్టర్, అదనపు జనగణన అధికారి అనిల్ కుమార్ హాజరై ర్యాలీని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా తమ స్వీయ గణన వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు.
ఏప్రిల్ 26 నుండి మే 10 వరకు స్వీయ గణన ప్రారంభించి నిర్వహించడం జరుగుతుందని ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారన్నారు. మే 11 నుండి జూన్ 9 వరకు ఇండ్ల గణన, ఇండ్ల సందర్శన జనగణన సిబ్బంది హాజరుకానున్నారని, ఆ కార్యక్రమంలో తమ వివరాలన్నీ నమోదు చేసుకోవాలని సూచించారు. దేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ ఈ జన గణన కార్యక్రమంలో పాల్గొని వివరాలను నమోదు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముఖ్య ప్రణాళిక అధికారి శ్రీనివాసరావు, డిపిఓ హరిప్రసాద్, మున్సిపల్ కమిషనర్ రాజేశ్వరరావు, సెన్సెస్ సిబ్బంది వినయ్, ఉద్యోగులు అశోక్, రాము, వెంకటేశ్వర్లు, తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు, స్వయం సహాయక బృందాల సభ్యులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.






