అన్నారంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ
స్థలం విషయంలో ముదిరిన వివాదం
పోలీసుల రంగ ప్రవేశంతో అదుపులోకి వచ్చిన పరిస్థితి
సజావుగా సాగిన ఉపాధి హామీ సోషల్ ఆడిట్ సమావేశం
తుంగతుర్తి, మార్చి 5 : మండలంలోని అన్నారంలో ఉపాధి హామీ పనులపై గ్రామపంచాయతీ ఎదుట సమీక్ష సమావేశం జరుగుతుండగా కాంగ్రెస్, బిఆర్‌ఎస్ నాయకుల మధ్య మాటామాటా పెరిగి ఉద్రిక్తతకు దారితీసింది. అన్నారం గ్రామపంచాయతీ పరిధిలో 2024_ 25 గాను ఉపాధి హామీ పనులకు సంబంధించి డిఆర్పి ప్రకాష్ సోషల్ ఆడిట్ నిర్వహిస్తున్నారు.
అదే సమయంలో గ్రామపంచాయతీ సమీపంలోనీ ఖాళీ స్థలాన్ని గతంలో రాళ్లు, వైర్లతో చుట్టగా సంబంధిత గ్రామపంచాయతీ సిబ్బంది జిల్లా డీపీఓ ఆదేశాల మేరకు తొలగింపు చేస్తున్నారు. అదే స్థల విషయంలో గతం నుండి కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నాయకుల మధ్య వివాదం నడుస్తుంది. అయితే గురువారం గ్రామపంచాయతీ సిబ్బంది చుట్టూ వేసిన కంచెను తొలగిస్తుండడంతో ఆది చూసిన ఇరువర్గాల మధ్య మాటామాటా పెరిగింది.
ఆ వివాదం కాస్త పెరిగి పెద్దది కావడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విషయం తెలుసుకున్న పోలీసులు రంగ ప్రవేశం చేసి, ఇరువురిని శాంతింప చేసి సమీక్ష సమావేశాన్ని కొనసాగించారు. జిల్లా నుండి అధికారులు వచ్చి చర్యలు తీసుకునేదాకా ఎవ్వరు ఈ స్థలంపై కొట్లాడవద్దని పోలీసులు హెచ్చరించారు. అయితే మొత్తం గ్రామములో 19 ఉపాధి హామీ పనులకు గాను సుమారు రూ.50 లక్షలు వెచ్చించినట్లు అధికారులు తెలిపారు. ఈ పనుల్లో కొన్ని అవకతవకలు ఉన్నాయని, చేయని పనులకు, చేయని సంతకాలకు డబ్బులు తీసుకున్నట్లు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.
దీనితో ప్రభుత్వ ఆదాయానికి గండి పడే అవకాశం ఉందని, జరిగిన సంఘటనపై, జిల్లా డిఆర్డిఏ అధికారులకు తెలుపనున్నట్లు అధికారి పేర్కొన్నారు. గ్రామంలోని ప్రజా సమస్యలను గాలికి వదిలి, ఇరువర్గాలు స్థలంపై కొట్లాడడం విడ్డూరంగా ఉందని ప్రజలు వాపోయారు. అనంతరం సర్పంచ్ కుంచాల శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ మండల, జిల్లా అధికారులతో మాట్లాడి గ్రామంలో ఎక్కువ మంది కూలీలకు ఉపాధి హామీ పనులు వచ్చే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ కవిత, వార్డు మెంబర్లు బింగి వెంకటేశ్వర్లు, గ్రామ పంచాయతీ కార్యదర్శి అనిల్, వార్డు మెంబర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు.




