రోజుకో వీధిలో పరిశుభ్రత కార్యక్రమా లు చేపట్టాలి
కామారెడ్డి పెద్ద చెరువులో వద్ద పరిశుభ్రత కార్యక్రమం
కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగువాన్
కామారెడ్డి,(విజయక్రాంతి): రోజుకో కాలనీలో పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువాన్ తెలిపారు. శనివారం కామారెడ్డి పెద్ద చెరువు వద్ద పచ్చదనం, పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణ కార్యక్రమంలో భాగంగా మున్సిపాలిటీ పరిధిలోని కామారెడ్డి జిల్లా కేంద్రం వద్ద గల పెద్ద చెరువు వద్ద శానిటేషన్ ను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రోజుకో వీధిలో పరిశుభ్రత కార్యక్రమం చేపట్టాలని సూచించారు.
ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో మొదటి థీమ్ అయిన పరిశుభ్రత, ఫైళ్ళ క్లియరెన్స్ కార్యక్రమంలో భాగంగా రెండవరోజు పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మార్చి, 6 నుండి 15 వరకు నిర్వహించే పరిసరాల పరిశుభ్రత కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని అన్ని వీధులు, వార్డులు, ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాలయాలు పరిశుభ్రం చేసే కార్యక్రమాలు నిర్వహించి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు.
ఈ 99 రోజుల కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలని, ప్రతి ఒక్కరు తమ ఇల్లు, తమ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకునే విధంగా కృషి చేయాలని తద్వారా రాబోయే వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల నుండి రక్షణ పొందవచ్చన్నారు. ఈ పది రోజుల్లో జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు తమ పరిసరాలను, కార్యాలయాల లోపల పరిశుభ్రంగా చేసుకోవాలని, అంతేకాకుండా కార్యాలయాల్లో పెండింగ్ లో ఉన్న ఫైళ్లు యుద్ధప్రాతిపదికన పరిష్కరించి అట్టి సమాచారాన్ని సంబంధిత లబ్ధిదారులకు తెలియపరచే విధంగా అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా మున్సిపాలిటీ పరిధిలో నిర్వహిస్తున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో వార్డు అధికారులు, కౌన్సిలర్ లు పాల్గొనేలా చూడాలని పట్టణ పరిశుభ్రతకు పాటుపడాలని కమిషనర్ ను కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మధుమోహన్, ఆర్డీఓ వీణ, తహసిల్దార్ హిమబిందు, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు, సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




