calender_icon.png 22 May, 2025 | 12:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గురుకులంలో ‘ఇంటర్’ మూసివేత?

22-05-2025 12:00:00 AM

  1. ఆందోళన చెందుతున్న గురుకుల విద్యార్థులు 
  2. ఎమ్మెల్యే చొరవ తీసుకోకుంటే తరలిపోతుందంటున్న గురుకుల అధికారులు

నిజాంసాగర్,  మే 21 : గురుకుల పాఠశాలలోని విద్యార్థులకు ఇంటర్ విద్యను అందించాలని ఉద్దేశంతో గతంలో స్థానిక నేతలు అధికారులు ప్రయత్నాలు చేసి ఇంటర్మీడియట్ కళాశాలను మంజూరు చేయించారు. ప్రస్తుతం ఆ కళాశాలను మూసి వేసి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. దీంతో స్థానికంగా ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్న సంఘటన ఇది.

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం లోని నిజాంసాగర్ మండలం అచ్చంపేట గ్రామంలో కొనసాగుతున్న సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఇంటర్మీ డియట్ విద్య బోధన గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతుంది. ఈ విద్యా సంవత్సరంలో ఇంటర్ విద్యను ఇక్కడ చెప్పకుండా ఇంటర్ కళాశాల ను ఇతర ప్రాంతాలకు తరలించేందుకు ఇంటర్ బోర్డు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.

దీంతో జుక్కల్ నియోజకవర్గం లోని విద్యార్థులకు ఇంటర్ విద్య  కలగా మిగిలిపోనుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంటర్ బోర్డు అధికారులతో పాటు బీసీ గురుకుల  రాష్ర్టస్థాయి అధికారులు తీసుకున్న నిర్ణయం వల్లనే గురుకులంలో ఉన్న జూనియర్ కళాశాలను మూసి వేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాల బిచ్కుంద మండల కేంద్రానికి 2022 సంవత్సరంలో మంజూరు అయింది.

అక్కడ సరైన వసతులు లేకపోవడంతో నిజాంసాగర్ మండల కేంద్రం పరిధిలోని (అచ్చంపేట)లో ఉన్న గురుకుల పాఠశాలలో ఇంట ర్మీడియట్ తరగతులను 2022 అక్టోబర్‌లోఎంఈసీ, సీఈసీ గ్రూపులు కళాశాలలో ప్రారంభించారు.

సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయంలో అప్పట్లో తరగతి గదుల కొరత ఏర్పడడంతో స్థానిక ఎంపీటీసీ సభ్యులు చాకలి సుజాత, రమేశ్ కుమార్, ప్రత్యేక చొరవ తీసుకొని  అప్పటి ఎంపీపీ పట్లోళ్ల జ్యోతి దుర్గారెడ్డి సహకారంతో మండల పరిషత్ నిధుల ద్వారా  కళాశాల అదనపు తరగతి గదుల కోసం రూ.5 లక్షల రూపాయలతో రెండు అదనపు గదులను నిర్మించారు.

ఇప్పుడు ఉన్నటువంటి రాష్ర్ట సాంఘిక సంక్షేమ గురుకులాల సెక్రటరీ అలుగు వర్షిని జూనియర్ కాలేజీని అర్ధాంతరంగా తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో గురుకులంలో ఇంటర్ విద్యాబోధన ఈ విద్యా సంవత్సరంలో నిలిచిపోనుంది.

తీవ్రంగా నష్ట పోనున్న విద్యార్థులు..

నిజామాబాద్, కామారెడ్డి ఉమ్మడి జిల్లాలో కేవలం ఆర్ట్స్ కళాశాల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల అచ్చంపేట లోనే నిర్వహిస్తున్నారు. ఉన్న సదుపాయాన్ని తొలగించేందుకు గురుకుల పాఠశాల కమిషనర్ వర్షిని తీసుకున్న నిర్ణయం తో ఉత్తర్వులు జారీ చేయడం వల్ల అచ్చంపేటలో ఉన్న జూనియర్ కళాశాలను తొలగించనున్నారు. ఈ కళాశాల మూసివేస్తే అనేకమంది ఆర్ట్స్ చదువుకోవాలనే విద్యార్థులు నష్టపో నున్నారు.

విద్యార్థుల భవిష్యత్తును గుర్తించి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు చొరవ చూపి అచ్చంపేట గురుకుల పాఠశాలలో జూనియర్ కళాశాల ఉండేలా చర్యలు చేపట్టాలని స్థానికులు నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు.

జూనియర్ కళకళాశాల తరలించకుండా ప్రజా ప్రతినిధులు, విద్యార్థి సంఘాల నాయకులు, స్థానిక అధికారులు అడ్డుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు,జుక్కల్ నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు. 2025 26 విద్యా సంవత్సరానికి జూనియర్ కళాశాలలో ఆర్ట్స్ అడ్మిషన్లు ప్రారంభించాలని జుక్కల్ నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు.

మూతపడకుండా ఎమ్మెల్యే చొరవ చూపాలి                   

కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం అచ్చంపేటలోని బిసి సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల తరలిపోకుండా కొనసాగించే విధంగా ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు చొరవ చూపాలని స్థానికులు కోరుతున్నారు. అచ్చంపేట నుండి జూనియర్ కళాశాల తొలగింపు విషయం పట్ల  జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ప్రత్యేక శ్రద్ధ తీసుకోనీ కాలేజీని తిరిగి తీసుకురావాలని కోరుకుంటున్నారు.

సామాన్యులకు ఉన్నత విద్యను అందుబాటులోకి తీసుకొస్తాం అన్న రాష్ర్ట ప్రభుత్వం ఉన్న కళాశాలల తొలగింపు పై విమర్శలకు గురవుతోంది. ఏది ఏమైనా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ప్రత్యేక చొరవ తీసుకొని కాలేజీని కొనసాగించాలని విద్యార్థుల తల్లిదండ్రులు జుక్కల్ నియోజకవర్గం ప్రజలు కోరుతున్నారు.

ఉత్తర్వులు వచ్చిన మాట వాస్తవమే..

కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం అచ్చంపేటలోని బిసి గురుకుల పాఠశాలలో కొనసాగుతున్న ఇంటర్మీడియట్ జూనియర్ కళాశాలను 2025 26 విద్యా సంవత్సరంలో కొనసాగకుండా గురుకుల పాఠశాల కమిషనర్ వర్షిణి ఉత్తర్వులు జారీ చేశారని గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ విజయక్రాంతి ప్రతినిధితో తెలిపారు.