21-05-2025 11:07:20 PM
ఓటు బ్యాంకుగానే ముస్లింల ఓటు..
ముస్లింలను ఓటు బ్యాంకుగానే వాడుతున్నారు..
వక్ఫ్ గౌరవాన్ని మంట కలపాలని చూస్తున్న కేంద్రం..
హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ..
నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): ఏ ప్రభుత్వలు వచ్చినా ముస్లింలకు చేసిందేమీ లేదని హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం జాతీయ అధ్యక్షులు అసదుద్దీన్ ఒవైసీ(AIMIM National President Asaduddin Owaisi) మండిపడ్డారు. బుధవారం నల్లగొండ గడియారం సెంటర్లో నిర్వహించిన ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ భారీ బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు. ఇప్పటి వరకు రాజకీయ నాయకులు ఓటు బ్యాంకుగానే ముస్లింల ఓట్లను వాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ గౌరవాన్ని మంట కలపాలని చూస్తుందని దుయ్యబట్టారు. కోర్టు కూడా చెప్పేసింది...! వక్ఫ్ విషయంలో ఎందుకు జోక్యం చేస్తున్నారు అని ప్రశ్నించింది అని తెలిపారు.
అవసరం లేని విషయంలో ఎందుకు వస్తున్నారని హెచ్చరించిందని అన్నారు. మన భూములను మన మసీదులను ఏ విధంగా పరిరక్షించుకోవాలో అందరికీ తెలుసు అని పేర్కొన్నారు. మనమంతా ముక్తకంఠంగా ఈ బిల్లును వ్యతిరేకించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ మెంబర్స్ మౌలానా జాఫర్ పాషా హుస్సేనీ మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుండి ముస్లింలను భయభ్రాంతులకు గురి చేయడంలో అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తుందని మండిపడ్డారు.
మొదలు త్రిపుల్ తలాఖ్ అని సిఏఏ అని, ఎన్ ఆర్ సి అని, ముస్లిం సమాజానికి తీవ్ర ఇబ్బందులు కలిగించే అన్ని నల్ల చట్టాల బిల్లును తీసుకొచ్చి ఇబ్బందులకు గురిచేస్తుందని ఆరోపించారు. ఇప్పుడు కొత్తగా వక్ఫ్ చట్టం బిల్లును తెచ్చి భయపెట్టాలని చూస్తుందని పేర్కొన్నారు.మీరు ఎన్ని బిల్లులను తీసుకువచ్చిన భయపడేది లేదని తేల్చి చెప్పారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ జిల్లా అధ్యక్షులు రజియోద్దీన్, సిపిఐఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి, వివిధ మైనార్టీ నాయకులు పాల్గొన్నారు.