22-05-2025 12:49:40 PM
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 103 అమృత్ భారత్ స్టేషన్లను(Amrit Bharat Station Scheme) ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) రాజస్థాన్ నుంచి వర్చువల్ గా ప్రారంభించారు. అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ... దేశంలో ఆధునిక మౌలిక సదుపాయాలు కల్పించే మహాయజ్ఞం జరుగుతోందని చెప్పారు. గత 12 ఏళ్లలో ఈ మహాయజ్ఞం నిరాటంకంగా సాగుతోందని వెల్లడించారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు(International standards), అత్యాధునిక సదుపాయాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. మౌలిక సదుపాయాల రంగంలో గతంలో ఖర్చు చేసిన దాని కంటే ఆరు రెట్లు ఎక్కువ ఖర్చు చేస్తున్నామని స్పష్టం చేశారు. దేశం నలుమూలలా మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు.
కాశ్మీర్ నుంచి అరుణాచల్ ప్రదేశ్(Arunachal Pradesh) వరకు మౌలిక సదుపాయాలు మెరుగుపరుస్తున్నామని వెల్లడించారు. ముంబయిలో అటల్ సేతు ఏర్పాటు చేసుకున్నాం.. బ్రాడ్ గేజ్ మార్గాల్లో మానవరహిత క్రాసింగ్ లు ఏర్పాటు చేస్తున్నాం.. తమిళనాడులో పంబన్ బ్రిడ్జి ఏర్పాటు చేసుకున్నాం.. వస్తు రవాణా కోసం ప్రత్యేక కారిడార్లు ఏర్పాటు చేస్తున్నాం.. దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల్లో 103 అమృత్ భారత్ స్టేషన్లను ప్రారంభించుకున్నామని ప్రధాని మోదీ సూచించారు. ఇక్కడికి వచ్చే ముందే కర్ణిమాత ఆశీస్సులు తీసుకున్నానని ప్రధాని తెలిపారు. బుల్లెట్ రైలు ప్రాజెక్ట్(Bullet Train Project) శరవేగంగా సాగుతోందని ప్రధాని పేర్కొన్నారు. గతంలో రైల్వే స్టేషన్లు ఎలా ఉండేవి.. ఇప్పుడు ఎలా ఉన్నాయి.. మీరే ఆలోచించండని తెలిపారు. అమృత్ భారత్ స్టేషన్లను ఆయా ప్రాంతాల ప్రత్యేకతలతో నిర్మించామని వెల్లడించారు. ఈ రైల్వే స్టేషన్లను ప్రజలే యజమానులు.. శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత కూడా ప్రజలదేనని ప్రధాని మోదీ పేర్కొన్నారు.