calender_icon.png 17 January, 2026 | 5:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాగిరెడ్డి పేటలో సీఎం కప్ ర్యాలీ

17-01-2026 03:47:25 PM

సీఎం కప్‌తో గ్రామీణ యువత క్రీడా ప్రతిభకు ప్రోత్సాహం... ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్

సీఎం కప్‌తో యువతలో క్రీడా చైతన్యం: ఎస్సై భార్గవ్ గౌడ్

చదువుతో పాటు క్రీడల్లోనూ విద్యార్థులు ముందుండాలి: డిప్యూటీ తాసిల్దార్ రాజేశ్వర్

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండల కేంద్రంలో సీఎం కప్ కార్యక్రమాన్ని పురస్కరించుకుని శనివారం టార్చ ర్యాలీ నిర్వహించారు.ఈ ర్యాలీలో యువత,విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని క్రీడల ప్రాధాన్యతపై నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ... సీఎం కప్ ద్వారా గ్రామీణ ప్రాంత యువతలో క్రీడా ప్రతిభను వెలికితీయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. క్రీడలు యువతను ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దడంతో పాటు క్రమశిక్షణ, ఐక్యతను పెంపొందిస్తాయని తెలిపారు.

సీఎం కప్ పోటీలు దశలవారీగా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. గ్రామ పంచాయతీ స్థాయి పోటీలు ఈనెల 17 నుండి 22 వరకు, మండల స్థాయి పోటీలు 28 నుండి 31 వరకు, నియోజకవర్గ స్థాయి పోటీలు ఫిబ్రవరి 3 నుండి 7 వరకు, జిల్లా స్థాయి పోటీలు 10 నుండి 14 వరకు, రాష్ట్ర స్థాయి పోటీలు 19 నుండి 26 వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. తరువాత గ్రామ ఎస్ఐ భార్గవ్ గౌడ్ మాట్లాడుతూ... సీఎం కప్ ర్యాలీ యువతను క్రీడల వైపు ప్రోత్సహించే మంచి కార్యక్రమమన్నారు.

ప్రభుత్వం చేపట్టిన ఈకార్యక్రమాన్ని గ్రామ స్థాయిలో విజయవంతం చేయడానికి పోలీస్ శాఖ సంపూర్ణ సహకారం అందిస్తుందని చెప్పారు. డిప్యూటీ తాసిల్దార్ రాజేశ్వర్ మాట్లాడుతూ... విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ ముందుండాలని సీఎం కప్ ద్వారా అవకాశాలు కల్పిస్తున్నారని తెలిపారు. నాగిరెడ్డిపేట్ మండలంలోని పాఠశాలల విద్యార్థులు పోటీల్లో చురుకుగా పాల్గొని ప్రతిభ చాటాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ప్రవీణ్ కుమార్, డిప్యూటీ ఎమ్మార్వో రాజేశ్వర్, ఎస్సై భార్గవ్ గౌడ్, గోపాల్పేట్ గ్రామ సర్పంచ్ వంశీకృష్ణ గౌడ్, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ రామ్మోహన్, పీడీలు సబత్ కృష్ణ, సుకుమార్ తదితరులు పాల్గొన్నారు.