7 August, 2026 | 3:54 AM

ఎల్బీనగర్‌పై సీఎం ప్రత్యేక దృష్టి

07-08-2026 02:33 AM

రోడ్లు, భవనాల కార్పొరేషన్ చైర్మన్ మల్‌రెడ్డి రాంరెడ్డి 

రంగారెడ్డి,ఆగస్టు 6 (విజయక్రాంతి): ఎల్బీనగర్ నియోజకవర్గానికి సీఎం రేవంత్ రెడ్డి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని రాష్ట్ర రోడ్లు భవనాల కార్పొరేషన్ చైర్మన్ మల్ రెడ్డి రాంరెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో ఇటీవల తాను ప్రతిపాదించిన రహదారుల అభివృద్ధి ప్రణాళికలో తొలి దశగా రెండు కీలక ఫ్లైఓవర్ ప్రాజెక్టులకు స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపిందని గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఎల్బీనగర్ నియోజకవర్గంలో రోజు రోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు రూ.685 కో ట్ల వ్యయంతో రెండు ఫ్లైఓవర్ల నిర్మాణానికి స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపిందని పే ర్కొన్నారు. ఈ ప్రాజెక్టులలో భాగంగా సాగ ర్ హైవేపై హస్తినాపురం  బీఎన్ రెడ్డినగర్  సాగర్ కాంప్లెక్స్ జంక్షన్ల వద్ద రూ.550 కోట్ల వ్యయంతో 3.2 కిలోమీటర్ల పొడవున ఆరు లేన్ల ఫ్లైఓవర్ నిర్మించనున్నట్లు తెలిపారు.

నాగోల్‌బండ్లగూడ మార్గంలోని ఆనంద్ నగర్ వద్ద రూ.135 కోట్ల వ్యయంతో 1.4 కిలోమీటర్ల పొడవున రెండు లైన్లు ఫ్లైఓవర్ నిర్మించనున్నట్లు వెల్లడించారు. ఈ ప్రాజెక్టుల ద్వారా పరిసర ప్రాంతాల ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గి, ప్రయాణం మరింత సులభతరం కానుందని తెలిపారు. ఎల్బీనగర్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన మౌలిక వసతుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, మిగిలిన ప్రతిపాదిత రోడ్ల అభివృద్ధి పనులకు కూడా త్వరలోనే పరిపాలనా అనుమతులు లభిస్తాయని రాంరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.