దళిత ఎమ్మెల్యేను కించపరిచిన సీఎం!
క్షమాపణ చెప్పాలని దళిత సంఘాల డిమాండ్
జహీరాబాద్, ఆగస్టు 16 : రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దళితుల పట్ల వ్యవహరిస్తున్న తీరును దళిత సంఘాలు తీవ్రంగా ఖండించాయి. పద్రాగస్టు రోజున సంగారెడ్డి జిల్లా కేంద్రంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి దళితులైన జహీరాబాద్ శాసనసభ్యులు మాణిక్ రావును ఆహ్వానించకపోవడం దీనికి నిదర్శనం అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అహంకారపూరితంగా దళితులను రాజకీయంగా అణిచివేసేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.
దళితుల కోసం పనిచేస్తున్నామని, దళితుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని ప్రగల్భాలు పలుకుతున్నారే తప్ప దళితులకు ఒరగ పెట్టింది ఏమి లేదని అన్నారు. ఆరు గ్యారెంటీలతో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం దళితులకు చేస్తున్న మోసాలను గురించి ఎమ్మెల్యే మాణిక్ రావు ప్రశ్నిస్తారని భయంతో ప్రభుత్వ కార్యక్రమానికి ఆహ్వానం పంపలేదని వారు పేర్కొన్నారు.
దళితులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గట్టి గుణపాఠం చెప్తామని వారు హెచ్చరించారు. ఈ సమావేశంలో కౌన్సిలర్ రాజు దీపా, బీఆర్‌ఎస్ నాయకులు బండి మోహన్, రాకేష్, శివప్ప, పవన్, సందీప్, మధు, పి.రాజు పాల్గొన్నారు.






