18 July, 2026 | 2:59 AM

టీజీ న్యాబ్, సైబర్ సెక్యూరిటీ కొత్త వాహనాలను ప్రారంభించిన సీఎం రేవంత్

02-07-2024 03:14 PM

హైదరాబాద్ : కమాండ్ కంట్రోల్ సెంటర్ లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం నార్కోటిక్ బ్యూరో ఫోటో ఎగ్జిబిషన్ ను తిలకించారు. వాల్ బోర్డుపై మార్పు మన ప్రభుత్వ బాధ్యత అని రాశారు. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ పోలీసు వాఖలో కొత్త వాహనాలకు జెండా ఉపి, ప్రారంభించారు. తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకు 27 ఫోర్ వీలర్స్, 40 ద్విచక్ర వాహనాలు, సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు 14 ఫోర్ వీలర్స్, 30 ద్విచక్ర వాహనాలు అందజేశారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... అధికారుల్లో నైపుణ్యంతో పాటు ఆత్మస్థైర్యాన్ని నింపడం తమ బాధ్యత అని ఆయన పేర్కొన్నారు.

పోలీసులకు కావాల్సిన అన్ని వసతులను కల్పించడం ప్రభుత్వం బాధ్యత అని గుర్తుచేశారు. చదువుకున్న వారు కూడా సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడుతున్నారు. సైబర్ నేరగాళ్ల ఫిర్యాదుకు 1930 టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేశామని, ఇప్పటి వరకు నేరస్తుల నుంచి సైబర్ క్రైమ్ పోలీసులు రూ.31 కోట్లు రాబట్టినట్లు ఆయన వెల్లడించారు. కొత్త నేర న్యాయ చట్టాలపై కూడా పోలీసులకు శిక్షణ ఇవ్వాల్సి ఉందన్నారు. హత్య, అత్యాచారం కన్నా.. ఈకాలంలో సైబర్ నేరాలే పెద్దవని, మధ్యతరగతి, పేదలే సైబర్ నేరాలకు గురవుతున్నారని సీఎం రేవంత్ చెప్పారు. విద్యార్థులు ఎక్కువగా గంజాయికి బానిసలు అవుతున్నారు.

సమర్థత ప్రదర్శించిన అధికారులకు పదోన్నతలు ఇచ్చే బాధ్యత తమ ప్రభుత్వానిదని ఆయన వ్యాఖ్యానించారు. మనం ఎదుర్కొంటున్న పెద్ద సమస్య డ్రగ్స్, సైబర్ నేరాలని, డ్రగ్స్ నేరస్తులు తెలంగాణ నేలపై అడుగు పెట్టాలంటే భయపడాలని సీఎం తెలిపారు. చిరంజీవి ముందుకొచ్చి డ్రగ్స్ కు వ్యతిరేకంగా అవగాహన వీడియో చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డి  మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపారు. సమాజాన్ని కాపాడాల్సిన బాధ్యత సినీ పరిశ్రమపై ఉందని, సినిమా టికెట్లు ధరలు పెంచాలని సినీ పెద్దలు తమ దగ్గరకు వస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. డ్రగ్స్, సైబర్ క్రైమ్ పై సినీ పరిశ్రమ అవగాహన కల్పించట్లేదన్నారు.

సినిమా చిత్రీకరణ అనుమతుల కోసం వచ్చే వారికి ముందస్తు షరతులు విధిస్తూ.. సినిమాలో నటించే వారితో డ్రగ్స్, సైబర్ నేరాలపై రెండు నిమిషాల వీడియోను చిత్రీకరించి ఇవ్వాలని హెచ్చరించారు. సినిమా హాల్ లో అవగాహన వీడియోలు ఫ్రీగా ప్రదర్శించాలని, అలా ప్రదర్శించిన థియేటర్లకే భవిష్యత్తులో అనుమతులు ఉంటాయని చెప్పారు. త్వరలోనే సినీ పరిశ్రమ పెద్దలతో సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వ విధానాలను వారి వివరిస్తామన్నారు. టీవీలో కూడా డ్రగ్స్, సైబర్ నేరాలపై అవగాహన చిత్రాలు ప్రదర్శించాలని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.