18 July, 2026 | 7:58 AM

గవర్నర్‌తో సీఎం భేటీ

02-07-2024 02:03 AM
  • మంత్రి వర్గవిస్తరణ, అసెంబ్లీ సమావేశాలు, ఎమ్మెల్సీల నియామకంపై చర్చ
  • ఉమ్మడి ఆస్తులు, అప్పులపై గవర్నర్ దృష్టికి తీసుకెళ్లిన సీఎం
  • విద్యా, రైతు కమిషన్‌తో పాటు మెడికల్ సైన్స్‌లోని వివిధ శాఖలు రెండుగా.. ఇతర బిల్లులపై చర్చ

హైదరాబాద్, జూలై 1 (విజయక్రాంతి): రాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్‌తో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాజ్‌భవన్‌లో భేటీ అయ్యారు. సోమవారం దాదాపు 2 గంటల పాటు జరిగిన ఈ భేటీలో రాష్ట్రానికి చెందిన పలు సమస్యలు, మంత్రివర్గ విస్తరణ, గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల ఎంపిక వ్యవహారంతో పాటు పలు బిల్లులకు సంబంధించిన అంశాలపై చర్చించి నట్లు సమాచారం. సోమవారం మధ్యాహ్నం 12.45 గంటలకు రాజ్‌భవన్‌కు చేరుకున్న సీఎం రేవంత్‌రెడ్డి, 2.55 గంటల వరకు గవర్నర్‌తో జరిగిన భేటీలో పలు అంశాలు చర్చకు వచ్చినట్లు తెలిసింది. మధ్యాహ్న భోజనం రాజ్‌భవన్‌లో చేసిన అనంతరం కూడా భేటీ కొనసాగింది.

రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వం అమలుచేస్తున్న వివిధ సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలపైన కూడా వీరి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది.  త్వరలో జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో ఆర్వోఆర్ చట్టంతో పాటు భూ చట్టాలను అన్నింటిని ఏకం చేసి ఒకే గొడుకు కిందకు తెచ్చేందుకు తీసుకొస్తు న్న బిల్లుపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది. వీటితోపాటు మున్సిపాలిటీలు, మెడికల్ సైన్సెస్‌లో ఉన్న వివిధ శాఖలను రెండుగా మార్చాలని,  కంపెనీలు, మైనార్టీ కమిషన్, విద్యా కమిషన్, రైతు కమిషన్‌తోపాటు పం చాయతీరాజ్ సవరణ బిల్లు, ప్రైవేట్ యూనివర్సిటీలకు సంబంధించిన బిల్లులపైన కూడా చర్చకు వచ్చినట్లుగా తెలిసింది.

గత ప్రభుత్వం అనురాగ్ యూనివర్సిటీ, మల్లారెడ్డి యూనివర్సిటీలకు అనుమతి ఇచ్చింది. అప్పుడు ప్రతిపక్షంలో కాంగ్రెస్ పార్టీ ప్రైవేట్ యూనివర్సిటీలను వ్యతిరేకించింది. అంతేకాకుండా మరి కొందరు కూడా ప్రైవేట్ యూనివర్సిటీల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. అయితే ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. 

ఇదిలా ఉండగా,  ఐదు రోజుల పాటు ఢిల్లీలోనే మకాం వేసిన సీఎం రేవత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు, కాం గ్రెస్ పెద్దలతో వరుస భేటీలు జరిపారు. నూతన పీసీసీ అధ్యక్షుడి ఎంపిక, మంత్రి మండలి విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీ తదితర అంశాలపై చర్చించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి గవర్నర్‌తో సమావేశం కావడం, అది కూడా రెండు గంటలపాటు సుదీర్ఘంగా చర్చించడం ప్రాధాన్యత సంతరించుకున్నది.

పార్టీ వర్గాల విశ్వసనీయ సమాచారం మేరకు మంత్రివర్గ విస్తరణ విషయంపై చర్చించినట్లు తెలుస్తోంది.  ఈ నెల 7 తర్వాత ఆషాఢ మా సం వస్తుండటంతో అంతకు ముందే ప్రమాణస్వీకారం చేయాలన్న భావనతో పార్టీ వర్గాలు ఉన్నాయి. ఏఐసీసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి, మంత్రివర్గ విస్తరణ చేసుకోవాలని సూచించి ఉంటే గవర్నర్ వద్ద.. ఇదే అంశాన్ని  చర్చించి ఉండొచ్చని చెబుతున్నారు. ఇక గవర్నర్ కోటా కింద రెండు ఎమ్మెల్సీలు ఖాళీగా ఉన్నాయి.

బీఆర్‌ఎస్ హయాంలో దాసోజ్ శ్రవణ్, కుర్ర సత్యనారాయణకు అవకాశం ఇవ్వగా.. అప్పటి గవర్నర్ తమిళిసై ఆ ఫైల్‌ను వెనక్కి పంపారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే గవర్నర్ కోటా కింద ఖాళీగా ఉన్న రెండు సీట్లకు కోదండరామ్, అమీర్‌అలీఖాన్ పేరు ను ప్రతిపాదిస్తూ పంపిన ఫైల్‌ను గవర్నర్ ఆమోదించారు. బీఆర్‌ఎస్ ప్రాతిపాదించిన అభ్యర్థులు కోర్టుకు వెళ్లడంతో.. ఈ నియామకానికి బ్రేక్ పడిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ ఇద్దరిని నామినేట్ చేయాలని గవర్నర్‌ను సీఎం కోరినట్లుగా సమాచారం. 

ఇక విభజన చట్టంలో పొందుపర్చిన అంశాలతో పాటు ఏపీతో ఉమ్మడి అంశాలు కూడా చర్చకు వచ్చినట్లుగా సమాచారం. పదేళ్లుగా ఏపీతో ఉమ్మడి ఆస్తులు, అప్పులు వ్యవహారం పెండింగ్‌లోనే ఉంది. సెక్షన్ 8 ప్రకారం ఉమ్మడి ఆస్తులు, అప్పులకు గవర్నర్ మధ్యవర్తిగా ఉండాలని కేంద్రం ఆదేశించింది. జూన్ 2తో హైదరాబాద్‌పై ఉమ్మడి రాజధాని గడువు ముగిసింది.   ఇటీవలనే గవర్నర్ రాధాకృష్ణన్ ఏపీ సీఎం చంద్రబాబునాయుడుతో భేటీ అయిన విషయం తెలిసిందే. ఏపీతో ఉన్న ఉమ్మడి ఆస్తులు, అప్పులు అంశం త్వరగా తేల్చాలని కూడా నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం. హైదరాబాద్‌లో ఉన్న ఉమ్మడి ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని గవర్నర్ దృష్టికి సీఎం తీసుకెళ్లారని చెబుతున్నారు. 

నేడు ఢిల్లీకి సీఎం, డిప్యూటీ  సీఎం? 

మంత్రివర్గ విస్తరణ, టీపీసీసీ అధ్యక్షుడి ఎంపికతో పాటు  నామినేటెడ్ పదవుల పంపకం తదితర అంశాలపై ఢిల్లీ పెద్దలతో చర్చించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంగళవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇప్పటికే  హస్తినలో ఐదురోజులుగా ఉన్న సీఎం పార్టీ పెద్దలతో భేటీ అయ్యి మంత్రివర్గ విస్తరణ తదితర అంశాలపై చర్చించారు. ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉండగా, ఆశావాహులు మాత్రం చాలామంది ఉన్నారు. సామాజిక సమీకరణాలు, మొదటి విడతలో చోటు దక్కని జిల్లాలను పరిగణలోకి తీసుకుని మంత్రివర్గంలో చోటు కల్పించనున్నారు.