18 July, 2026 | 8:15 AM

కలిసి.. చర్చిద్దాం

02-07-2024 01:44 AM

విభజన సమస్యలపై 6న హైదరాబాద్‌లో చర్చించుకుందాం

సీఎం రేవంత్‌కు ఏపీ సీఎం చంద్రబాబు లేఖ

రేవంత్ సానుకూల స్పందన.. ప్రజాభవన్‌లో భేటీ!

హైదరాబాద్, జూలై 1 (విజయక్రాంతి): విభజన సమస్యలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారం లేఖ రాశారు. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు పూర్తయినా.. విభజన సమస్యలు అలాగే ఉన్నాయని, వాటిని పరిష్కరించుకోడానికి ముఖాముఖిగా చర్చించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ఇద్దరం ఈ నెల 6వ తేదీన మధ్యాహ్నం హైదరాబాద్‌లో కలిసి సమస్యలపై చర్చిద్దామని లేఖలో టీడీపీ చీఫ్ ప్రతిపాదించారు.

ఏపీ, తెలంగాణ మధ్య  ఉన్న కీలకమైన సమస్యలు ముఖామఖిగా కూర్చొని మాట్లాడి తేనే పరిష్కారం అవుతాయని, ఈ సమావేశం మంచి ఫలితాలను అందిస్తుందని తాను నమ్ముతున్నట్లు చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. అలాగే తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం పరస్పరం సహకరించుకోవాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. తెలంగాణ సీఎంగా తనదైన శైలిలో పాలన సాగిస్తున్న  రేవంత్ రెడ్డికి చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు.

అంకిత భావం, నాయకత్వం, తెలంగాణ ప్రగతికి గణనీయంగా తోడ్పడుతున్నాయని రేవంత్‌ను అభినందించారు. ఇలా ఉండగా చంద్రబాబుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సానుకూలంగా స్పందించారు. ఏపీ సీఎం చంద్రబాబుకు మంగళవారం ఒక లేఖ రాయనున్నారు. ౬వ తేదీన ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ప్రజాభవన్‌లో జరిగే అవకాశం ఉన్నది.