calender_icon.png 2 November, 2025 | 8:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేశ సైన్యంపై సీఎం అనుచిత వ్యాఖ్యలు

02-11-2025 01:34:28 PM

హైదరాబాద్: జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక పోలింగ్ దగ్గర పడుతుండటంతో అన్ని పార్టీలూ తమ ప్రచారాన్ని వేగవంతం చేశాయి. ఇటు అధికార పార్టీ నుంచి సీఎం రేవంత్‌రెడ్డి, ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్‌ఎస్ పార్టీ నుంచి కేటీఆర్ రంగంలోకి దిగడంతో జూబ్లీహిల్స్ రాజకీయం వేడెక్కింది. ఆయా పార్టీల ఉధృతమైన ప్రచారంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని వీధులన్నీ కిక్కిరిసిపోతున్నాయి. ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి, కేటీఆర్ మధ్య తీవ్రమైన పోటీ నడుస్తోంది. 

భారత సైన్యంపై అవమానకరమైన వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణలు చెప్పాలని భారత రాష్ట్ర సమితి (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం డిమాండ్ చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... పాకిస్తాన్ మనల్ని తన్నినప్పుడు, మనం ఎదుర్కోవడంలో విఫలమయ్యామని వ్యాఖ్యానించిన తర్వాత వివాదం చెలరేగింది. భారత సాయుధ దళాల ధైర్యం, సమగ్రతను దెబ్బతీసేలా ఆయన వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తచేశారు. సీఎం వ్యాఖ్యాలపై  స్పందించిన కేటీఆర్ ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తికి ఇటువంటి బాధ్యతారహితమైన, అవమానకరమైన వ్యాఖ్యలు తగవని విరుచుకుపడ్డారు.

ఎన్నికల ర్యాలీలో రాజకీయ పాయింట్లు సాధించడానికి భారత సైన్యాన్ని అవమానించడం నీచమన్నారు, ముఖ్యమంత్రి తన ప్రకటనను ఉపసంహరించుకోని భారత సైన్యానికి బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సాయుధ దళాలలో చేరడానికి, దేశం కోసం ఒకరి జీవితాన్ని పణంగా పెట్టడానికి అపారమైన కృషి, అంకితభావం, నిబద్ధత, దేశం పట్ల ప్రేమ అవసరమని బీఆర్ఎస్ నాయకుడు పేర్కొన్నారు. మన సైనికులు అత్యంత క్రూరమైన, క్లిష్ట పరిస్థితులను భరిస్తూ సరిహద్దుల వద్ద కాపలాగా నిలుస్తున్నందుకే మనం సురక్షితంగా జీవించగలుగుతున్నాము, రాజకీయాలు చేయగలుగుతున్నాము, మా కుటుంబాలతో సమయం గడపగలుగుతున్నామని కేటీఆర్అ అన్నారు.

రేవంత్ రెడ్డి మాటల వెనుక ఉన్న ఉద్దేశ్యాన్ని ప్రశ్నిస్తూ.. మీరు మన సైన్యాన్ని తక్కువ చేసి పాకిస్తాన్‌ను కీర్తించడానికి కారణమేమిటి?, మన ధైర్య సైనికులను అవమానించడం ద్వారా మీరు ఏమి సాధించడానికి ప్రయత్నించారు?” అని కేటీఆర్ అడిగారు. ఒకప్పుడు నగదు సంచులతో పట్టుబడిన వ్యక్తికి, గూండాలు, రౌడీ షీటర్లను పూజించడం సహజమే కావచ్చు. కానీ తెలంగాణ ముఖ్యమంత్రిగా మీరు గౌరవం, దేశభక్తిని ప్రదర్శించాల్సిన బాధ్యత ఉందన్నారు. భారత సైన్యాన్ని అవమానించడం ఆపండి, శత్రు దేశాన్ని ప్రశంసించడం ఆపండి అని ఆయన స్పష్టం చేశారు.

రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు సైన్యాన్ని అత్యున్నతంగా గౌరవించే కోట్లాది మంది భారతీయుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచాయని కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణ ప్రతినిధిగా, మీరు బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని, మన సరిహద్దులను కాపాడే సైనికులను గౌరవించాలి - మీ రాజకీయ నాటకీయత కోసం వారిని తక్కువ చేయకూడదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సూచించారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలను బీజేపీ ఇప్పటికే ఖండించిందని, ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది.