02-11-2025 02:27:55 PM
హైదరాబాద్: హైడ్రా చర్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం తెలంగాణ భవన్ లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నిర్వహించారు. హైడ్రా బాధితులతో కలిసి పవర్ పాయింట్ ప్రజెంటేషన్, ఎగ్జిబిషన్ చేశారు. పెద్దలకూ న్యాయం.. పేదలకూ న్యాయం నినాదంతో హైడ్రా వెళ్తోందని కేటీఆర్ పేర్కొన్నారు. అర్థరాత్రి.. అపరాత్రి లేకుండా పేదల ఇళ్లు కూల్చి వేస్తున్నారని మండిపడ్డారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో భవన నిర్మాణాలు మాత్రమే కనిపించేవాని, హైదరాబాద్ మహా నగరంలో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్తు చేశారు. సచివాలయం, టీహబ్, వీహబ్, పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్, అలాగే హైదరాబాద్ లో 42 ఫ్లైఓవర్లు, అండర్ పాస్ లు నిర్మించామన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత రెండేళ్లలో నగరంలో కొత్తగా ఒక్క నిర్మాణం చేపట్టలేదని కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ సర్కార్ వల్ల అన్యాయం జరిగిన వారికి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెరువును పూడ్చి ఇల్లు కడితే ఎందుకు కూల్చలేదు..?, ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న మంత్రి వివేక్ వెంకటస్వామి ఇల్లు కూల్చే ధైర్యం ఉందా..? అని కేటీర్ ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి ఇల్లు దుర్గంచెరువు ఎఫ్టీఎల్ లో ఉందని, అయితే ఆయన కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకునేందుకు హైడ్రా సమయం ఇచ్చిందన్నారు. పేదలు రాజప్రసాదాలు, ప్యాలెస్ లు కట్టుకపోయినా వాటిని కూల్చివేశారని, పేద్దవాళ్లు భవంతులు, ఫామ్ హౌస్ లు నిర్మిస్తే వాటిని కూల్చే ధైర్యం లేదన్నారు. గాజులరామారంలో అరికెపూడి గాంధీ స్థలం జోలికి వెళ్లలేదని, అక్కడ పేదలు నివాసం ఉంటున్న ఇళ్లపైకి మాత్రం బుల్డోజర్లు, పోలీసులను పంపారని కేటీఆర్ దుయ్యాబట్టారు.