వైఎస్ఆర్ స్ఫూర్తిని కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తుంది
హైదరాబాద్: వ్వవసాయం దండగ కాదు.. పండగ చేయాలని వైఎస్ఆర్ సంకల్పించారని, రైతులకు ఉచిత విద్యుత్ పై చెరగని ముద్రను వైఎస్ఆర్ వేశారని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) వైఎస్ఆర్ మెమోరియాల్ అవార్డ్స్ కార్యక్రమంలో అన్నారు. ఇవాళ ఒకపార్టీ అధికారంలోకి రావాలంటే ఉచిత విద్యుత్ ఇవ్వాల్సిందే అనే పరిస్థితి తెచ్చారని, రైతులు విద్యుత్ బకాయిలు రద్దు చేసి.. విద్యుత్ కేసులు కొట్టివేసి గొప్ప నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఇవాళ ఉచిత విద్యుత్ ను ఎవరు ఇచ్చినా.. వైఎస్ఆర్ నే గుర్తుకు తెచ్చుకుంటారన్నారు. భవిష్యత్ లోనూ ఎవరూ రద్దు చేయలేని పథకాలను వైఎస్ఆర్ అమలు చేశారని, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్ మెంట్ వంటి పథకాలను రద్దు చేసే ధైర్యం ఎవరికీ లేదని అన్నారు. వైఎస్ఆర్ స్పూర్తిని ఈ ప్రభుత్వం కొనసాగిస్తుందని.. రూపాయికి కిలో బియ్యం స్థానంలో ఉచితంగా సన్నబియ్యం ఇస్తున్నామని సీఎం పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే రైతులకు రుణమాఫీని అమలు చేశామని.. రుణమాఫీ కింద 26 లక్షలు మంది రైతుల ఖాతాల్లో రూ. 21 వేల కోట్లు వేశామన్నారు.
రసాయన ఎరువుల కొనుగోలు రూపంలో మన లక్షల కోట్ల సంపద విదేశాలకు వెళ్తుందని.. మన సంపద విదేశాలకు వెళ్లొద్దంటే రసాయన ఎరువుల వాడకం తగ్గించాలని తెలిపారు. సుభాష్ పాలేకర్ స్పూర్తిగా రైతులు సేంద్రీయ ఎరువును అనుసరించాలని.. తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత-చేవెళ్ల నిర్మించి రంగారెడ్డి జిల్లాకు నీరు ఇవ్వాలని వైఎస్ఆర్ సంకల్పించారని అన్నారు. గత ప్రభుత్వం ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును పక్కకు పెట్టి రంగారెడ్డి జిల్లాలను నిర్వీర్యం చేసిందన్నారు. ఫ్లోరైడ్ వల్ల జీవించలేని పరిస్థితులు ఉన్న నల్గొండ జిల్లాను మార్చాలని వైఎస్ఆర్ భావించారని.. నల్గొండ జిల్లాకు తాగు, సాగునీరు ఇచ్చే లక్ష్యంతో ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులు చేపట్టారని సీఎం రేవంత్ అన్నారు. గత ప్రభుత్వం పదేళ్ల పాటు ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులను పక్కకు పెట్టిందని, పదేళ్లు పనులు ఆగిపోవడంతో ఎస్ఎల్బీసీ టన్నెల్ లో ప్రమాదం జరిగిందన్నారు. ఎన్ని ఆటంకాలు వచ్చినా.. ఎస్ఎల్బీసీ టన్నెల్ ను పూర్తి చేస్తామన్నారు. రాహుల్ గాంధీని ప్రధానిగా చేయడమే తనకు మిగిలిన ఏకైక కోరిక అని వైఎస్ఆర్ అనేవారన్నారు.






