బీఆర్ఎస్ పదేళ్ల విధ్వంసం— వందేళ్ల నష్టానికి దారి తీసింది
- దేశానికి మహాత్ముడు, అంబేద్కర్ రెండు కళ్లు
- అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారే తెలంగాణ వచ్చింది
- తెలంగాణ ఉద్యమంలో గద్దర్ పాత్ర మరవలేనిది
హైదరాబాద్: దేశవ్యాప్తంగా అంబేద్కర్ జయంతి వేడుకలు(Ambedkar Jayanti Celebrations) ఘనంగా జరుగుతున్నాయి. హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ దగ్గర నిర్వహించిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహానికి రేవంత్ రెడ్డి పూలమాల వేసిన నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి సీఎంతో పాటు పలువురు మంత్రులు, నేతలు హాజరయ్యారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మాట్లాడుతూ... దేశానికి మహాత్ముడు, అంబేద్కర్ రెండు కళ్లు అన్నారు. స్వాతంత్ర్య పోరాటంలో మహాత్ముడి పాత్ర ఎంత ఉందో.. దేశాభివృద్ధిలో అంబేద్కర్ పాత్ర కూడా అంతే ఉందని పేర్కొన్నారు. ప్రపంచదేశాలకు ఆదర్శంగా భారత్ అభివృద్ధి చేయవచ్చని, అందరికీ సమాన అవకాశాలు ఇవ్వొచ్చని అంబేద్కర్ మార్గదర్శనం చేశారని సీఎం గుర్తుచేశారు.
అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారానే తెలంగాణ రాష్ట్రంగా మారిందన్నారు. గద్దర్ గజ్జె కట్టి గల్లీ గల్లీ తెలంగాన ఉద్యమాన్ని ఉధృతం చేశారని కొనియాడారు. గత కేబినెట్ లో, ఈ కేబినెట్ లో ఎస్సీలు, ఎస్టీలు ఎంతమంది ఉన్నారో చూడండన్నారు. భట్టి విక్రమార్క గతంలో సీఎల్పీ నేత హోదాను తొలగించేలా గతంలో కుట్రలు జరిగాయని ఆరోపించారు. ఎస్సీ నాయకుడు స్పీకర్ గా, ఆర్థిక మంత్రిగా ఉండకూడదా? అని ప్రశ్నించారు. ఇవాళ ఓయూ, అంబేద్కర్ వర్సిటీల వైస్ చాన్సలర్ గా ఎవరున్నారో చూడండని తెలిపారు. పదేళ్లలో ఎనాడైనా డైట్ చార్జీలు, కాస్మెటిక్స్ చార్జీలు పెంచారా? గత పదేళ్ల పాలనను, తమ రెండేళ్ల పాలనను గమనించాలని రాష్ట్ర ప్రజలను కోరారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో తమకు పట్టం కడితే ఓర్వలేకపోతున్నారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. మా హయాంలో 67 వేల పైచిలుకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. 67 వేల ఉద్యోగాల్లో 87 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకే వచ్చాయని పేర్కొన్నారు. మేం నిరంతరం పనిచేస్తుంటే, కొందరు గోలులు తవ్వుతున్నారని రేవంత్ ఫైర్ అయ్యారు. గోతులు తవ్వుతున్నవారిని మీరే అదే గోతిలో పాతి పెట్టాలని పిలుపునిచ్చారు. పదేళ్ల విధ్వంసం వందేళ్ల నష్టానికి దారి తీసిందని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆనాడు చేసిన అప్పులు చెల్లిస్తూ, తప్పులు సవరిస్తున్నామని సీఎం రేవంత్ పేర్కొన్నారు.




