తెలంగాణకు కేసీఆర్ కుటుంబమే ప్రధాన శత్రువు: సీఎం రేవంత్
- ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్.
- నా దగ్గర ఉన్న శాఖలనే కొత్త మంత్రులకు కేటాయిస్తా.
- కొత్త మంత్రుల శాఖలపై క్లారిటీ ఇచ్చిన సీఎం.
- సీఎం ప్రకటనతో పాత మంత్రుల వద్ద శాఖల్లో మార్పులు లేనట్లే.
- సీఎం దగ్గర కీలకమైన 11 శాఖలు.
- నేను ఉన్నంత వరకూ.. కేసీఆర్ కుటుంబానికి కాంగ్రెస్ లో నో ఎంట్రీ..
- కేసీఆర్ కుటుంబ సభ్యులే తెలంగాణకు శత్రువులు: సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్: కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో(Kaleshwaram Lift Irrigation Project) జరిగిన అవకతవకలకు సంబంధించి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షుడు కె. చంద్రశేఖర్ రావు (కేసీఆర్) బుధవారం హైదరాబాద్‌లోని పీసీ ఘోష్ కమిషన్ ముందు హాజరయ్యారు. కేసీఆర్ విచారణపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Telangana Chief Minister Revanth Reddy) ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలో జరిగిన మంత్రివర్గ విస్తరణపై ఢిల్లీలో ఎలాంటి చర్చ జరగలేదని తెలిపారు. కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుపైనా ఎలాంటి చర్చ లేదన్నారు. హైదరాబాద్ కు వచ్చాక అందరితో సంప్రదించి శాఖలు నిర్ణయిస్తామని సీఎం పేర్కొన్నారు.
రెండ్రోజుల్లో కాళేశ్వరంపై ప్రెస్ మీట్ పెడతా
కాళేశ్వరం గురించి రెండ్రోజుల్లో ప్రెస్ మీట్ పెడతానని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కాళేశ్వరానికి సంబంధించి డాక్యుమెంట్లన్నీ బయటపెడతానని చెప్పారు. నేనున్నంత వరకు కాంగ్రెస్ లోకి కేసీఆర్ కుటుంబానికి ఎంట్రీ లేదని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ కుటుంబమే ప్రధాన శత్రువు అని రేవంత్ రెడ్డి తేల్చిచెప్పారు. కర్ణాటకలో కుల గణనకు సంబంధించి మాత్రమే చర్చ జరిగిందన్నారు. తెలంగాణకు సంబంధించి కేంద్రంలో అన్నింటికీ అడ్డుపడుతున్నది కిషన్ రెడ్డేనని తెలిపారు. ఏ ఒక్క ప్రాజెక్టుకు కిషన్ రెడ్డి నిధులు సాధించలేదని ఆరోపించారు.






