యువతిపై అఘాయిత్యానికి యత్నం!
- ప్యాట్నీ సెంటర్ సమీపంలో ఘటన
- అర్ధరాత్రి వేళ బరితెగించిన దుండగులు
సికింద్రాబాద్, జూలై 19 (విజయ క్రాంతి): నగరంలో మహిళల భద్రతకు ఎంతటి భరోసా కల్పిస్తున్నా అర్ధరాత్రి వేళల్లో ఒంటరిగా ప్రయాణించే వారిపై కామాంధులు పంజా విసురుతూనే ఉన్నారు. శనివారం తెల్లవారుజామున సికింద్రాబాద్ పరిధిలోని ప్యాట్నీ సెంటర్ సమీపంలో ఒక యువతికి ఎదురైన భయానక అనుభవం శాంతిభద్రతల పరిస్థితిపై ఎంతోఆందోళన రేకెత్తిస్తోంది.
లిఫ్ట్ కోసం వేచి ఉండగా ఊహించని విపత్తు ..
బేగంపేట పోలీసుల ప్రాథమిక దర్యాప్తు వివరాల ప్రకారం సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతానికి చెందిన ఒక 26 ఏళ్ల యువతి వ్యక్తిగత పని నిమిత్తం శనివారం నాగోల్కు వెళ్లింది. పని ముగించుకున్న అనంతరం తిరిగి వచ్చే క్రమంలో శనివారం తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో నాగోల్ నుంచి ఒక ద్విచక్ర వాహనంపై లిఫ్ట్ తీసుకుని ప్యాట్నీ సెంటర్కు చేరుకుంది. అక్కడి నుంచి తన గమ్యస్థానానికి వెళ్లేందుకు మరో వాహనం కోసం ఆమె రోడ్డుపై వేచి ఉంది.
నిర్జన ప్రదేశానికి లాక్కెళ్లి అఘాయిత్యానికి యత్నం..
యువతి ఒంటరిగా ఉండటాన్ని గమనించిన ఇద్దరు గుర్తుతెలియని దుండగులు ఆమె సమీపంలోకి వచ్చారు. ఎవరు లేని సమయాన్ని ఆసరాగా చేసుకుని, ఆమెను బలవంతంగా పక్కనే ఉన్న ఒక ఖాళీ స్థలంలోకి ఈడ్చుకెళ్లారు. అక్కడ ఆమెపై లైంగిక దాడికి యత్నించారు. ఊహించని ఈ ప్రమాదం నుంచి కోలుకున్న బాధితురాలు ఏమాత్రం అధైర్యపడకుండా నిందితులను బలంగా ప్రతిఘటించింది.
కేకలు వేయడంతో చెవి కమ్మలతో పలాయనం : దుండగుల బారి నుంచి తప్పించుకునే క్రమంలో బాధితురాలు గట్టిగా కేకలు వేయడం ప్రారంభించింది. ఆమె కేకలకు భయపడిన దుండగులు, ఎవరైనా చుట్టుపక్కల వారు వస్తారేమోనని ఆందోళన చెందారు. ఆ కంగారులో ఆమె చెవులకు ఉన్న బంగారు కమ్మలను బలవంతంగా లాక్కొని అక్కడి నుంచి అంధకారంలో పరారయ్యారు.
రంగంలోకి దిగిన పోలీసులు.. క్లూస్ టీం..
నిందితులు పారిపోయిన వెంటనే బాధితురాలు తీవ్ర భయాందోళనల నడుమ ‘డయల్ 100’ ద్వారా పోలీసులకు సమాచారం అందించింది. సమాచారం అందుకున్న వెంటనే బేగంపేట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.
బాధితురాలి నుంచి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నామని, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని బేగంపేట పోలీసులు వెల్లడించారు. నడిరాత్రి ప్రయాణించే మహిళలు అపరిచిత వ్యక్తుల వాహనాలలో లిఫ్ట్లు అడగవద్దని, అత్యవసర సమయాల్లో పోలీసు సహాయం కోరాలని సూచించారు.






