29-08-2025 12:59:08 PM
హైదరాబాద్: ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకాలు సాధించి భారతదేశ కీర్తిని ప్రపంచానికి చాటిన హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్‌చంద్ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) వారి సేవలను స్మరిస్తూ నివాళులర్పించారు. ధ్యాన్‌చంద్ జయంతిని(Dhyan Chand Jayanti ) పురస్కరించుకుని జరుపుకునే జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి క్రీడాకారులు, క్రీడాభిమానులకు శుభాభినందనలు తెలియజేశారు. జాతీయ క్రీడా దినోత్సవం అనేది వివిధ దేశాలలో జాతీయ క్రీడా జట్లను, ఆ దేశాల క్రీడా సంప్రదాయాలను గౌరవించడానికి జరుపుకునే ప్రభుత్వ సెలవుదినం. ఈ రోజున వివిధ వయసుల ప్రజలు కబడ్డీ, మారథాన్, బాస్కెట్‌బాల్, హాకీ మొదలైన క్రీడలలో పాల్గొంటారు.
హైదరాబాద్ లో జరిగిన స్పోర్ట్స్ హబ్ ఆఫ్ తెలంగాణ పాలక మండలి తొలి సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో క్రీడా విధానం, క్రీడల ప్రోత్సాహం విషయంలో ప్రతి ఒక్కరూ హైదరాబాద్ గురించి మాట్లాడుకోవాలనేదే తన లక్ష్యమన్నారు. క్రీడా ప్రపంచానికి హైదరాబాద్ వేదికగా మారాలని ఆకాంక్షించారు. ఖేలో ఇండియా, కామన్ వెల్త్, ఒలింపిక్స్ ఇలా ఏ పోటీలు నిర్వహించినా వాటిలో తెలంగాణకు అవకాశం కల్పించాలని తెలంగాణ స్పోర్ట్స్ హబ్ తీర్మానం చేసింది. రాష్ట్రంలో స్టేడియాల నిర్వహణ, వసతులు మెరుగుపర్చడం, కోచ్‌లు, ట్రైనర్‌లకు శిక్షణ, క్రీడా పాలసీలో వివిధ అంశాలపై ప్రణాళిక రూపకల్పన, అమలుకు సబ్ కమిటీల ఏర్పాటు చేయాలని బోర్డు తీర్మానాలను ఆమోదించింది.