29-08-2025 02:05:36 PM
ఐదు శాఖల అధికారులు, సిబ్బందితో ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ
రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): ఎగువ మానేరు వద్ద వాగును దాటుతున్న క్రమంలో గల్లంతైన వ్యక్తి ఆచూకీ కనిపెట్టేందుకు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా(Collector Sandeep Kumar Jha) ఆదేశాల మేరకు ప్రత్యేక ప్రత్యేక సెర్చింగ్ ఆపరేషన్ టీంను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఎగువ మానేరు వద్ద వాగును దాటుతున్న క్రమంలో గంభీరావుపేట మండలం నర్మాల గ్రామానికి చెందిన పంపుకాడి నాగయ్య బుధవారం గల్లంతు అయ్యారు.
ఆయన ఆచూకీ కనిపెట్టేందుకు రెవెన్యూ, పంచాయతీ రాజ్, పోలీస్, నీటి పారుదల, మత్స్య శాఖ అధికారులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశాల మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఎగువ మానేరు ప్రవహించే మండలాల్లోని చెక్ డ్యాంలు, బ్రిడ్జిలు, కల్వర్టులు ఇతర ప్రాంతాల్లో తనిఖీలు చేయాలని సూచించారు. నర్మాల నుంచి గంభీరావుపేట వరకు, గంభీరావుపేట నుంచి మల్లారెడ్డిపేట వరకు, మల్లారెడ్డిపేట నుంచి ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ వరకు, వెంకటాపూర్ నుంచి సిరిసిల్ల వరకు, సిరిసిల్ల నుంచి మధ్య మానేరు రిజర్వాయర్ వరకు వెతకాలని ఒక్కో ప్రాంతానికి ఐదుగురితో కలిపి ప్రత్యేక టీంను ఏర్పాటు చేశారు. ఈ టీమ్ సభ్యులు వెంటనే తమ విధి నిర్వహణను మొదలు పెట్టాలని ఆదేశించారు.