29-08-2025 01:16:46 PM
గ్రామాలలో హెల్త్ క్యాంపులు నిర్వహించాలి
సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కలవేన శంకర్
మంచిర్యాల, (విజయక్రాంతి): ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల పట్టింపు లేనితనంతో విష జ్వరంతో విద్యార్థి మృతి చెందాడని సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు(CPI State Secretariat Members) కలవేన శంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం సిపిఐ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆదివాసీ ప్రాంతాల్లో విద్యార్థులకు ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా చూడాలని కోరారు. అభివృద్ధి చెందిన ఈ దేశంలో వైద్యం అందక విద్యార్థీ మృతి పాలకులు తలవంచుకునే పరిస్థితి అని, వాతావరణ పరిస్థితులు, వర్ష ప్రభావం ఎక్కువ ఉండడం వల్ల కలుషిత నీరు, దోమలు వల్ల డెంగ్యూ లాంటి విష జ్వరాలు ప్రబలే అవకాశాలు ఉన్నందున జిల్లాలో ప్రతి గ్రామంలో హెల్త్ క్యాంపులు నిర్వహించి విష జ్వరాలను నివారించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలం పంగిడిమాదార ఆశ్రమ పాఠశాలలో 6వ తరగతి చదివే ఆత్రం అనురాగ్ వరంగల్ ఎంజీఎంలో డెంగ్యూ జ్వరంతో మృతి చెందాడని, అనురాగ్ సోదరుడు ఆత్రం అబెడ్నిగో (3వ తరగతి) జ్వరంతో హాస్పిటల్ లో అడ్మిట్ అయి ఉన్నాడన్నారు. ఇలాంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాతో పాటు మంచిర్యాల జిల్లాలోని అన్ని గ్రామాలలో హెల్త్ క్యాంపులు నిర్వహించి డెంగ్యూ లాంటి విష జ్వరాలు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని ఈ జిల్లా అధికార యంత్రాంగాన్ని డిమాండ్ చేశారు. ఎప్పటికప్పుడు ఇంటింటా సర్వే నిర్వహించి విష జ్వరాలు అరికట్టే విధంగా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, మేకల దాసు, కలిందర్ అలీ ఖాన్, రేగుంట చంద్రశేఖర్, ఇప్పకాయల లింగయ్య, జోగుల మల్లయ్య, లింగం రవి, మిరియాల రాజేశ్వర్ రావు, ముస్కే సమ్మయ్య, మిట్టపల్లి పౌలు, చాడా మహేందర్ రెడ్డి, కొత్తపల్లి మహేష్, మొగిలి లక్ష్మణ్, నర్సయ్య, రాయమల్లు తదితరులు పాల్గొన్నారు.