calender_icon.png 22 July, 2025 | 12:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అత్యవసర పరిస్థితులు.. రూ.కోటి కేటాయించాలి

21-07-2025 06:54:21 PM

హైదరాబాద్: జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ లో వర్షాలు, వానాకాలం పంటల సాగు, సీజనల్ వ్యాధులు, రేషన్ కార్డుల పంపిణీపై సమీక్షించారు. గ్రామలోని వెటర్నరీ డాక్టర్లు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలని, జిల్లాల పరిధిలోని ఐఏఎస్ అధికారులు  క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆదేశించారు. కలెక్టర్ల కార్యాచరణ రిపోర్టు రోజూ తనకు పంపించాలని, ఆదివాసీ ప్రాంతాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని చెప్పారు. 

అత్యవసర పరిస్థితుల్లో ఖర్చు పెట్టడానికి ఒక్కొక్క కలెక్టర్లకు రూ.కోటి కేటాయించాలని ఆదేశించారు. వాటర్ మేనేజ్ మెంట్ పై కలెక్టర్లు దృష్టి పెట్టాలని, ఎరువులను రైతులకు అందుబాటులోకి తేవాలన్నారు. రైతులకు ఎరువులు దొరకడం లేదని ప్రతిపక్ష నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. షాపులో ఎంత స్టాక్ ఉందో బయట నోటీస్ బోర్డులో పెట్టాలని, ఎరువుల దుకాణాల వద్ద పోలీసులు, అధికారులు ఉండాలని తెలిపారు.

రాష్ట్రంలో సరిపడినంత ఎరువులు ఉన్నాయని, రైతులేవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రాయితీపై ఇచ్చే ఎరువులను ఇతర వ్యాపారాలకు వాడుతున్నారని, అలా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఎరువుల దారిమళ్లింపును కలెక్టర్లే అడ్డుకోవాలని ఆదేశించారు.  ఈ కార్యక్రమానికి ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, గడ్డం వివేక్ వెంకటస్వామి, ఉన్నతాధికారులు కలెక్టర్లు పాల్గొన్నారు.