6 May, 2026 | 12:31 AM

పాశమైలారం ఘటనపై నిపుణుల కమిటీ.. సీఎం ఆదేశం

01-07-2025 12:17 PM
  1. పాశమైలారానికి సీఎం రేవంత్‌ రెడ్డి. 
  2. సిగాచి పరిశ్రమ ప్రమాద స్థలిని పరిశీలించిన సీఎం రేవంత్‌ రెడ్డి. 
  3. సిగాచి ప్రమాద స్థలంలో అధికారులతో సీఎం రేవంత్‌ సమీక్ష.
  4. ప్రమాదంపై నిపుణులతో విచారణ జరిపి పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశం.
  5. కొత్త వారితో విచారణ జరిపించాలని ఆదేశం.
  6. సీఎంతో పాటు మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి.

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) మంగళవారం పాశమైలారంలోని సిగాచి పరిశ్రమ ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ప్రమాద ఘటనపై సీఎం అధికారులతో మాట్లాడి సహాయ చర్యల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రమాద స్థలంలో మంత్రులు, అధికారులతో రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రమాదం జరిగిన పరిశ్రమలలో తనిఖీలు చేశారా?, బాయిలర్లను తనిఖీ చేసి ఏమైనా సమస్యలు గుర్తించారా?, బాయిలర్ల పనితీరుపై యాజమాన్యానికి చెప్పారా?, పరిశ్రమల శాఖ, బాయిలర్స్ డైరెక్టర్స్ తనిఖీలు చేశారా? అని సీఎం అధికారులను ప్రశ్నించారు. ఈ పరిశ్రమలో గతంలో ఏమైనా ప్రమాదాలు జరిగాయా? అని ప్రశ్నించారు. ఊహాజనిత సమాధానాలు చెప్పవద్దని సీఎం హెచ్చరించారు. ప్రమాద ఘటనపై నిపుణులతో చర్చించి సమగ్ర నివేదిక ఇవ్వాలని సీఎం రేవంత్ కోరారు.

కొత్త వారితో కమిటీ వేసి తక్షణం నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ఇతర పరిశ్రమల్లోనూ తనిఖీలు నిర్వహించాలనిఅధికారులను ఆదేశించారు. కార్మికులకు బీమా సౌకర్యం, పరిశ్రమకు అనుమతులు, భద్రతా ప్రమాణాలపై సీఎం ఆరా తీశారు. బాధిత కుటుంబాలకు ఆర్థికంగా తక్షణ సాయం కల్పించాలని  సీఎం ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ.లక్ష, క్షతగాత్రులకు రూ.50 వేలు అందించాలన్నారు. క్షతగాత్రుల వైద్య ఖర్చులు తామే భరిస్తామని  ఫ్యాక్టరీ యాజమాన్యం వెల్లడించింది. సీఎం రేవంత్ వెంట మంత్రులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు(Minister Sridhar Babu), పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, దామోదర రాజనర్సింహ, ఉన్నారు. పాశమైలారం పేలుడు ఘటనలో మృతుల సంఖ్య ఇప్పటికే 36కు చేరింది. వివిధ ఆస్పత్రుల్లో 31 మంది చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతున్న వారిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పరిశ్రమ వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.